ఆ ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకోగలరా.?

మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులకు వైసీపీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. ఈ లిస్టులో మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వున్నారు. ‘మంత్రి పదవుల నుంచి తప్పించింది, పార్టీ పదవులు ఇవ్వడం కోసమే.. అది మాకు మరింత గౌరవం..’ అని చెప్పుకున్నారు కొడాలి నాని, మంత్రి పదవి పోవడంపై.

కానీ, ఇప్పుడు సీన్ మారింది. పార్టీ పదవులు కూడా పోయాయ్. మరిప్పుడు ఆ వైసీపీ నేతల పరిస్థితేంటి.? తిరిగి వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశముందా.? అసలు టిక్కెట్లు అయినా వాళ్ళకు మళ్ళీ దక్కుతాయా లేదా.? వైసీపీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కాయ్.! ఎట్టి పరిస్థితుల్లోనూ 175కి 175 సీట్లు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో బిజీగా వున్నారు. మరి, పార్టీ ముఖ్య నేతలూ తమ పని తాము చెయ్యాలి కదా.? అయితే, కొందరు నేతలు అధినేత హెచ్చరికల్ని కూడా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కొందర్ని పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు.
కాగా, ‘మీరు మళ్ళీ కష్టపడండి.. గెలవడం.. మళ్ళీ పదవులు వస్తాయ్..’ అని గతంలో మంత్రి పదవులు కోల్పోయిన నేతలకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇప్పుడేమో పార్టీ పదవుల నుంచీ వారిని పీకెయ్యడంతో ఆయా నేతల్లో కలకలం బయల్దేరింది. అలాగని అధినేతను ధిక్కరించలేరాయె. ‘పార్టీ కోసం కష్టపడినందుకు మాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా.?’ అంటూ సదరు నేతలు ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారు.