జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న రోడ్ మ్యాప్ ఇదేనా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రపక్షం బీజేపీ నుంచి ఓ రోడ్ మ్యాప్ ఆశిస్తున్నారు. అసలు మిత్రపక్షం నుంచి రోడ్ మ్యాప్ ఆశించడమేంటి.? ఈ విషయమై జనసేన అధినేత చాలా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. రోడ్ మ్యాప్ విషయమై జనసేనాని ఒకింత రాజకీయ అపరిపక్వతను ప్రదర్శిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే, జనసేనతో బీజేపీకి అవసరం వుంది గనుక, ఈ విషయమై జనసేనానిని ఏమీ అనలేకపోతోంది బీజేపీ. కాగా, రోడ్ మ్యాప్ అంటే ఇంకేమీ కాదనీ, వైసీపీ మీదా, వైసీపీ ప్రభుత్వం మీదా కేంద్రం నుంచి ‘చర్యలు’ జనసేనాని ఆశిస్తున్నారనీ, అదే రోడ్ మ్యాప్ అనీ.. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అవినీతిని కేంద్ర ప్రభుత్వం వెలికి తీయాలన్నది ఆ రోడ్ మ్యాప్ వ్యవహారంలో కీలకమైన అంశమట.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపడం కూడా జనసేనాని ఆశిస్తున్న రోడ్ మ్యాప్‌లో ఓ ముఖ్యమైన అంశమంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రదర్శిస్తున్నంత దూకుడు, ఏపీలో వైసీపీ సర్కారు మీద బీజేపీ చూపించడంలేదని జనసేనాని ఒకింత అసహనంతో వున్నారు. బీజేపీ రాజకీయ అవసరాలు వేరు. వాటిని తీర్చడానికి వైసీపీ తనవంతుగా కృషి చేస్తూనే వుంది. అలాంటప్పుడు, కేంద్రం నుంచి వైసీపీ సర్కారుపై చర్యలు ఎలా వుంటాయ్.? తెలంగాణ విషయంలో ఆ పరిస్థితి లేదు మరి. అందుకే, అక్కడ కేంద్రం నుంచి కొంతమేర ‘చర్యలు’ కనిపిస్తున్నాయి.

నిజానికి, రాజకీయాలెలా వున్నా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత వుండాలి. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో అలాంటివి ఆశించలేం. ఆ విషయం జనసేనానికి అర్థం కావడంలేదా.? అర్థమయ్యీ, అవనట్లు వ్యవహరిస్తున్నారా.? బీజేపీని రోడ్ మ్యాప్ అడిగేకంటే, అధికారంలోకి రావడానికి ఎలాంటి రోడ్ మ్యాప్ అవసరమో.. పార్టీ శ్రేణులతో చర్చించుకుని జనసేనాని ఓ నిర్ణయానికి రావడం బెటర్.