మొబైల్ వాడొద్దు అన్నందుకు ఏకంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థి?

ఈ తరం యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకొని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తల్లిదండ్రులు మందలించారని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని ఇలా చిన్న చిన్న వాటికె ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నూరేళ్లు హాయిగా జీవించాల్సిన వాళ్ళు పాతికేళ్లు కూడా నిండని ముందే వారి జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. అయితే చదువుకున్న యువత కూడా ఆత్మహత్యలకు పాల్పడడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదని, మొబైల్ ఫోన్ నీ ఉపయోగించవద్దు అంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే సమాజంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

తమ తల్లిదండ్రులు వారి కోసమే చెబుతున్నారన్న విషయాన్ని పిల్లలు మరచి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ వాడద్దని తల్లిదండ్రులు మందలించారని ఏకంగా విషంతాగి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరు పల్లి గ్రామానికి చెందిన బూడిగ నరేష్, ఉమాదేవి దంపతులకు మనీషా అనే అమ్మాయి ఉంది. కరోనా మహమ్మారి సమయంలో మొబైల్ లో ఆన్ లైన్ క్లాసులు వింటూ అలవాటు చేసుకున్న ఆమె, ప్రస్తుతం విద్యా సంస్థలు తెరిచిన తర్వాత కూడా ఆ ఫోన్ చూసే అలవాటు మానుకోలేదు.

మనీషా స్నేహితులతో గంటలకొద్దీ ఫోన్ లో మాట్లాడటం, అవసరానికి మించి ఫోన్ ఎక్కువగా యోగించడం చేస్తుండటంతో తన తల్లి ఉమాదేవి మనీషాను హెచ్చరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి హెచ్చరించడంతో మనస్థాపానికి గురైన మనీషా, మొబైల్ విషయంలో తన తల్లి తిట్టిందన్న కోపంలో ఇంట్లో ఉన్న కలుపు మందు తాగేసింది. విషం తాగి వాంతులు చేసుకుంటుండగా ఏమైందని తల్లిదండ్రులు అడగగా పురుగుల మందు తాగినట్లు తెలిపింది. వెంటనే మనీషానీ కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ మనిషా చికిత్స తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయింది. మనీషా తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.