Child Crime: పొలంలో మొక్క పీకినందుకు బాలుడిని చంపిన మైనర్ బాలుడు..!

Child Crime: కొన్ని సందర్భాలలో చిన్న పిల్లల మధ్య సరదాగా మొదలైన గొడవలు పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వస్తాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా మనం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా ఇద్దరి పిల్లల మధ్య జరిగిన గొడవలో బాలుడు తన ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్న సినిమా డైలాగ్ అందరికీ బాగా గుర్తుంటుంది. ఇప్పుడు మనం చర్చించుకునే సంఘటన కూడా సినిమా స్టైల్ లో జరిగింది. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్ జిల్లా పరిధిలో ఒక మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖాక్నార్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బుర్హాన్‌పూర్ జిల్లాలోని షెఖ్‌పూర్ గ్రామంలో జనవరి 26న బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. షెఖ్‌పూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తమ పొలంలోని శనగ తోటకు కాపలా వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు శనగ తోటకు వెళ్లి మొక్కలు పీకి కాయలను కోసుకున్నాడు. ఇదంతా చూసిన మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని మొక్కలు పీకినందుకు ఆగ్రహంతో చితకబాదాడు.

మొక్కలు పీకి నందుకు బాలుడిని కొట్టి అక్కడినుండి మైనర్ బాలుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. దెబ్బలు బాగా తగలడంతో 7 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. మర్నాడు ఉదయం మైనర్ బాలుడు పొలానికి వెళ్లగా అక్కడ స్పృహ లేకుండా ఆచేతనంగా పడిఉన్న బాలుడిని చూసి వెంటనే గ్రామంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటన గురించి ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు జనవరి 28వ తేదీ బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కి తరలించగా , మైనర్ బాలుడు గొంతు నులిమి చంపినట్టు నివేదికలో పేర్కొన్నారు. దానితో పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.