Pushpa and Akhanda : పుష్ప, అఖండ సినిమాలకి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారా.?

Pushpa and Akhanda : ‘పుష్ప’, ‘అఖండ’, ‘బంగార్రాజు’ సినిమాల విషయంలో ఎలా వ్యవహరించామో, ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలోనూ అలాగే వ్యవహరించామని అధికార వైసీపీ చెబుతోంది. మంత్రులూ ఇదే మాట చెబుతున్నారు. నిజమేనా.? అంటే, కానే కాదని.. అధికార పార్టీ నేతల అంతరాత్మకీ తెలుసు.

‘పుష్ప’ సినిమాకి కావొచ్చు, ‘అఖండ’ సినిమాకి కావొచ్చు.. మంత్రులైతే ప్రెస్ మీట్లు పెట్టలేదు. ‘బంగార్రాజు’ సంగతి సరే సరి. కానీ, ‘భీమ్లానాయక్’ సినిమా కోసం మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. అంతేనా, ‘అఖండ’, ‘పుష్ప’ సినిమా విడుదలైన రోజున, వీఆర్వోలని థియేటర్లలో తనిఖీల కోసం ప్రత్యేకంగా నియమించలేదు. కానీ, ‘భీమ్లానాయక్’ విషయంలో వీఆర్వోలు, పోలీసులు, ఇతర అధికారులు.. స్పెషల్ డ్యూటీలు చేశారు.

చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్. ‘అఖండ’ సినిమాని చాలా చోట్ల ఫ్లాట్ రేటుకి టిక్కెట్లు అమ్మేశారు. ‘పుష్ప’ విషయంలో కూడా ఇది జరిగింది. అయితే, కొన్ని థియేటర్లపై నామమాత్రపు చర్యలు తీసుకుని, చాలా థియేటర్ల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించింది అధికార యంత్రాంగం.

‘భీమ్లానాయక్’ దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. సుమారు 80 వరకు థియేటర్లు, ‘ఈ వేధింపులతో మేం నడపలేం’ అని మూతపడ్డాయి తాత్కాలికంగా. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి.

సరే, ‘భీమ్లానాయక్’ సినిమాలో రాజకీయ డైలాగులు, పవన్ కళ్యాణ్ చేసిన అర్థం పర్థం లేని సవాళ్ళు.. అది వేరే చర్చ. కానీ, ప్రభుత్వ పెద్దలు.. తమ స్థాయిని తగ్గించుకుని ‘భీమ్లానాయక్’ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారన్నది నిర్వివాదాంశం.