వైఎస్ జగన్ ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్లోని మంత్రులు బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. పదవులు ఇచ్చేటప్పుడే మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సీఎం చెప్పడంతో తమ పదవులకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని, అందుకోసం పూర్తి పనితనాన్ని బయటపెట్టి ముఖ్యమంత్రి మన్ననలు అందుకోవాలని అందరు మంత్రులు డిసైడ్ అయ్యారు. వారిలో కొందరు ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి వారిలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి గెలుపొందిన వెల్లంపల్లి వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు కేబినెట్లో పదవి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా జగన్ ఆయనకు అవకాశం కల్పించారు. పదవి దక్కినా దాన్ని నిలబెట్టుకోవాలి కదా అంటూ కొందరు వెల్లంపల్లిని లైట్ తీసుకున్నారు.
వారిలో టీడీపీ పార్టీ కూడ ఉంది. మంత్రివర్గం బలహీనంగా ఉంటే ముఖ్యమంత్రిని ఈజీగా టార్గెట్ చేయవచ్చనే ఆలోచనతో టీడీపీ వెల్లంపల్లిని టార్గెట్ చేసింది. ఇక ఎల్లో మీడియా సైతం ఆయన మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఆయన్ను రచ్చకు తేవాలని అనుకున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లంపల్లి మీద ఆరోపణలకు తెర లెపారు. వెల్లంపల్లి విజయవాడలోని వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇదంతా బెదిరింపుల ద్వారానే జరుగుతోందని ఆరోపణలు చేశారు. వ్యాపారస్తుల్ని బెదిరించి దండుకుంటున్నావు, దుర్గ గుడి మొత్తం దోచేస్తున్నావు, వినాయకుడి గుడిని నాకేశావు అంటూ ధ్వజమెత్తారు.
అంతేనా.. ఆలయ ప్రసాదాలను అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డివిజన్లలో పంచిపెట్టారనే విమర్శించారు. ఈ ఆరోపణల్ని పట్టుకుని ఎల్లో మీడియా స్టింగ్ ఆపరేషన్లు చేసి, ఏదో కూపీ లాగేద్దాం, మంత్రి పునాదులు కదిలించేద్దాం అని తెగ ప్రయాసపడ్డారు. కానీ వెల్లంపల్లి మాత్రం వేటికీ జడవలేదు. ఆయన వసూళ్లకు పాల్పడ్డట్టు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అసలు ఉంటే కదా దొరకడానికి. భూముల కుంభకోణానికి పాల్పడ్డారని వార్తలు ప్రచురిస్తే వెల్లంపల్లి విచారణకు ఆదేశించి నిజాయితీని నిరూపించుకున్నారు. ఇలా వెల్లంపల్లి టీడీపీ, ఎల్లో మీడియా తన మీద ఎన్ని కుట్రలకు పాల్పడినా అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగిపోతున్నారు.