AP: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం పథకం ఒకటి. అయితే తాజాగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 15వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కూటమినేతలు ప్రస్తుతం మాత్రం 13000 రూపాయలు తల్లుల ఖాతాలు జమ చేయబడుతుందని మిగిలిన 2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా 2000 రూపాయలకు కోత పెట్టడంతో వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
నారా లోకేష్ 13000 తల్లులు ఖాతాలో జమచేస్తూ 2000 రూపాయలను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నామని చెప్పడంతో వైసీపీ నేతలు మాత్రం ఈ రెండు వేల రూపాయలు లోకేష్ జాబు లోకి వెళ్తున్నాయి అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై నారా లోకేష్ గట్టిగానే స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయం గురించి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.
లోకేష్ జోబులోకి ₹2,000 పోతున్నాయి అంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆధారాలతో సహా నిరూపిస్తే తానే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవిత సవాల్ విసిరారు. అలా నిరూపణ చేయలేకపోతే నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావా అంటూ ప్రశ్నించారు.2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశారని అన్నారు. ఒక్కరుంటే రూ.13,000, ఇద్దరైతే రూ.26,000 ఇలా పెరిగేలా నగదు మంజూరు చేశారన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అమ్మబడి వేశారని సవిత గుర్తు చేశారు.తల్లికి వందనం పథకం ద్వారా గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు.ప్రజలు ఏ నమ్మకంతో తమకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అనేకమంది సలహాదారులు ఉన్నప్పటికి రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదన్నారు. ప్రజలు ఓట్ల రూపంలో ఎన్నికలలో బుద్ధిచెప్పిన ఇంకా వైసీపీ నేతల తీరు మారలేదు అంటూ సవిత విమర్శల కురిపించారు.