ఎవరన్నా ప్రశంసిస్తే పొంగిపోవడం మామూలే. కానీ, ఆ ప్రశంసకి నేను అర్హుడ్ని కాదు.. నాకంటే గొప్పగా ఆ అర్హత కలిగిన వ్యక్తి వేరే వున్నారని చెప్పగలగడం ఎంతమందికి సాధ్యం.? అందుకే, ఆయన కల్వకుంట్ల తారకరామారావు అయ్యారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్, మంత్రి కేటీఆర్ మీద ప్రశంసలు గుప్పించేస్తూ, ‘సూపర్ హీరో’ అని అభివర్ణించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ, ‘నేన కాదు, సోనూ సూద్ నిజమైన సూపర్ హీరో..’ అని పేర్కొన్నారు. తనను కేటీఆర్, సూపర్ హీరో.. అని ప్రశంసించడాన్ని సోనూ సూద్ గొప్ప గౌరవంగా భావించారు. మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.. అంటూ ప్రశంసించారు సోనూ సూద్. తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని కూడా అన్నారు. కాగా, ‘నేను ప్రజా ప్రతినిథిని.. నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. ఎలాంటి పదవీ లేకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు సోనూ సూద్’ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం, కేటీఆర్ గొప్పతానన్ని చెప్పకనే చెబుతోంది.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో వుంటూ, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా, ఆ సమస్యను పరిష్కరించడానికి కేటీఆర్ తనవంతుగా సాయపడుతుంటారు. తాను స్వయంగా కరోనా బారిన పడ్డంతో కొన్నాళ్ళు కేటీఆర్ సోషల్ మీడియాకి దూరంగా వున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆసుపత్రుల్లో బెడ్స్ సౌకర్యం కల్పించడం దగ్గర్నుంచి, అవసరమైనవారికి అవసరమైన మందుల్ని అందజేయడం వరకు.. కేటీఆర్, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక, సినీ పరిశ్రమతో కేటీఆర్ నడిపే సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమలో అందరికీ ‘అందరివాడు’ అనే స్థాయిలో సన్నిహిత సంబంధాలు కేటీఆర్ కొనసాగిస్తున్నారు.