Kodali Nani : కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించేలా చేయాలన్న వ్యూహంతో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందట. అలాగని స్వయంగా కొడాలి నాని ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వస్తూనే, జంబో క్యాబినెట్ ప్రకటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రెండున్నరేళ్ళ పదవీ కాలం తర్వాత, కొత్తవారికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామనీ, మొత్తంగా పాత మంత్రి వర్గాన్ని మార్చుతామనీ ప్రకటించిన విషయం విదితమే.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు పూర్తయిపోయింది. రేపో మాపో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తప్పదు. మంత్రులుగా పని చేసినవారికి పార్టీ బాధ్యతలు అప్పగించి, పార్టీ కోసం ఇప్పటిదాకా పని చేస్తూ వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చి.. 2024 ఎన్నికలకు మరింత పకడ్బందీగా సిద్ధమవ్వాలన్నది వైఎస్ జగన్ ఆలోచన.
అయితే, ‘నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం ద్వారా రాజకీయంగా విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది..’ అంటూ కొడాలి నాని ‘లాక్’ చేశారు.. ఎవర్నో తెలుసా.? ఇంకెవర్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నాని పదవి పోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సరే, ఈ ప్రచారంలో నిజమెంత.? అన్నది వేరే చర్చ. ఇప్పుడు గనుక మంత్రి కొడాలి నానిని తప్పిస్తే, టీడీపీ వ్యూహం వర్కవుట్ అయినట్లే అవుతుంది. అలా కొడాలి నాని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని తెలివిగా లాక్ చేశారంటూ వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయినా, వైసీపీలో పదవులు మారితే.. తద్వారా టీడీపీకి వచ్చే లాభమేముంటుంది.? టీడీపీ ఎలా గెలిచినట్లవుతుంది.? కొడాలి నాని ఇలా ఎందుకు మాట్లాడారబ్బా.? అత్యంత వ్యూహాత్మకంగా కొడాలి నాని ‘పావు’ కదిపారు సరే, మరి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా వున్నాయో ఏమో.!