Minister Botsa : ఏపీ ఉద్యోగుల వెనుక రాజకీయం: చర్చలకు అందుకే వెళ్ళట్లేదా.?

Minister Botsa : ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం.. వేతనాల విషయమై అభ్యంతరాలుంటే ప్రభుత్వంతో చర్చించాలి. ఆందోళనల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఉద్యోగులు ఎంత ఆందోళన చేసినా, చివరికి సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. అలాంటప్పుడు, ఉద్యోగులు చర్చలకు రావడమే మంచిది. చర్చలకు రావట్లేదంటే, వారి వెనుక రాజకీయం ఏదో వుందనే విషయం అర్థమవుతోంది.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఆర్సీ విషయమై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. పీఆర్సీ పేరుతో ప్రభుత్వం తమను మోసం చేసిందన్నది ఉద్యోగుల ఆరోపణ, ఆవేదన. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పిబ్రవరిలో సమ్మె చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మ నోటీసు కూడా అందించారు.

సమ్మె జరిగితే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగులకూ మధ్య ఘర్షణ వాతావరణం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకీ శాపంగా మారుతుంది. కొత్త పీఆర్సీ వద్దు.. పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని ఉద్యోగులు తెగేసి చెబుతున్న దరిమిలా, ప్రభుత్వమెందుకు బేషజాలకు పోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘మీ జీతాలు తగ్గవు.. జీతాలు పడితేనే కదా.. జీతాలు పెరిగిందీ లేనిదీ తెలుస్తుంది..’ అంటోంది ప్రభుత్వం. ఎవరి వాదన వారిదే. ఎవరూ పట్టు వీడటంలేదు, మెట్టు దిగడంలేదు. మంత్రుల కమిటీ ప్రతిరోజూ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కోసం ఎదురుచూస్తూనే వుంది. ఉద్యోగ సంఘాల నుంచి కొందరు చర్చలకు వెళుతున్నా.. అవన్నీ అసంపూర్ణమే. వెళ్ళాల్సిన వారు చర్లకు వెళ్ళకపోవడమే అందుక్కారణం.

అమ్మో ఒకటో తారీఖు.. అనేలా ఫిబ్రవరి 1వ తేదీ వచ్చేస్తోంది. ఉద్యోగులు, ప్రభుత్వం మెట్టు దిగకపోతే, ఆ తర్వాత ఏమవుతుందో ఏమో.!