రాజధానిపై బొత్స అయోమయం.! వీళ్ళా మంత్రులు.?

ఆయన సీనియర్ పొలిటీషియన్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.. ఇప్పుడూ మంత్రిగా పని చేస్తున్నారు. దురదృష్టమేంటంటే, ఆయన మంత్రిగా పని చేస్తున్న రాష్ట్రానికి రాజధాని ఏదో ఆయనకే తెలియదు.! రాష్ట్రానికి మూడు రాజధానులున్నాయా.? ఒకే రాజధాని వుందా.? అని ప్రశ్నిస్తే?సమాధానం చెప్పలేనంత అయోమయం ఓ సీనియర్ మంత్రికే వుంటే.. అసలు రాష్ట్రానికి వీరి వల్ల ఏం ఉపయోగం.

మంత్రులంటే మీడియా ముందుకొచ్చి తమ అధినేత మీద ప్రశంసలు గుప్పించడం, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించడం. అంతేనా.? ఇంకేమీ లేదా.? ఏ శాఖ మంత్రి ఆ శాఖలపై సమీక్ష చేస్తున్నారా.? లేదా.? అసలంటూ కనీసపాటి అవగాహన అయినా ఆయా మంత్రులకు వుందా.? లేదా.? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్.

ఆ సంగతి తర్వాత.! ముందైతే రాజధాని వ్యవహారం తేలాలి. ఎందుకంటే, రాష్ట్రంలో రాజధాని తప్ప మరో ముఖ్యమైన అంశమేదీ లేదా.? అన్నట్లు తయారైంది పరిస్థితి. నిజమే, రాష్ట్రానికి రాజధాని అనేది అతిముఖ్యమైన విషయమే. గడచిన మూడేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని ఏదన్న సందిగ్ధత ఏర్పడింది.

వైసీపీ దృష్టిలో అమరావతి అసలు రాజధానే కాదు. అదొక స్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం కూడా. మళ్ళీ అదే వైసీపీ, అమరావతిని శాసన రాజధానిగా వుంచుతామంటోంది. వైసీపీలోనే రెండు రకాల ధోరణలు. ‘ఇప్పటికైతే అమరావతి.. కానీ, మేం మాత్రం మూడు రాజధానులు కోరుకుంటున్నాం.. మూడు రాజధానులు చేసి తీరతాం.’ అని చెప్పడం తప్పు లేదు.!

అయితే, ఆ విషయం కూడా వైసీపీ ముఖ్య నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంలేదు. తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో బొత్స సత్యనారాయణని సీనియర్ జర్నలిస్టు పదే పదే ‘రాష్ట్ర రాజధాని ఏది.?’ అనడిగారు. సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలారాయన.