3 Capitals : అంత మొత్తుకుంటున్నాసరే, మూడు ముక్కలాట విషయమై వెనక్కి ‘తగ్గేదే లే’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, తప్పలేదు.. తాము చేసిన చట్టాన్ని తామే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థిని చవిచూడాల్సి వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
ఇప్పుడేమో, రాజధాని (3 Capitals )విషయంలో సీఆర్డీయే చట్టం ప్రకారం నడచుకోవాల్సిందేననీ, రాజధానిపై కొత్తగా చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదనీ హైకోర్టు తేల్చేసింది. మరిప్పుడు, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది.? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘మేం ఊహించినట్టుగానే హైకోర్టు తీర్పు వచ్చిందనీ, సీఆర్డీయే చట్టం అమల్లోనే వుందనీ, తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అనీ’ మంత్రి బొత్స సత్యనారాయణ, హైకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు.
అయితే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్ని వేరే చోటకి తరలించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అంటే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే జ్యుడీషియల్ క్యాపిటల్ అన్న ప్రస్తావనే ఇకపై వుండకపోవచ్చు.
కానీ, ఒకవేళ హైకోర్టు తీర్పుని ప్రభుత్వం గనుక సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే.. అక్కడ సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే.. మూడు రాజధానుల అంశం మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది.
ఒక్కటి మాత్రం నిజం.. సీఆర్డీయే చట్టం రూపకల్పనతోనే, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు పూర్తి రక్షణ లభించిందనీ, జగన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చలేదనీ ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన విపక్షాల వాదనే హైకోర్టు తాజా తీర్పుతో నెగ్గినట్లయ్యింది.