YSRCP Facing Negativity : ఉద్యోగులు మెత్తబడ్డారా.? ప్రభుత్వం పంతం నెగ్గించుకుందా.? అన్నది వేరే చర్చ. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉద్యోగులూ కాస్త మెత్తబడ్డారు. ‘విన్ విన్ సిట్యుయేషన్’ అన్నట్టుగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఉపాధ్యాయ సంఘాలు గుస్సా అవుతుండొచ్చు. తమను ఉద్యోగ సంఘాల నాయకులు వెన్నుపోటు పొడిచారని ఆరోపించొచ్చు. ప్రభుత్వమూ తమపై పడుతున్న అదనపు భారంపై గుస్సా అవుతుండొచ్చు. కానీ, అంతిమంగా సమ్మె ఆగిపోయింది గనుక, రాష్ట్ర ప్రజలకు పెద్ద ఊరట. ఎందుకంటే, ఉద్యోగుల సమ్మెతో తొలుత నష్టపోయేది సాధారణ ప్రజానీకమే.
కాగా, ఉద్యోగ సంఘాల్లో చిచ్చు రాజేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అసలంటూ ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు తిరగడానికీ, ఎల్లో రాజకీయమే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులపై వైసీపీ మద్దతుదారులు చేసిన విమర్శలు తక్కువేమీ కావు.
ఎవరైతే ఉద్యోగుల్ని అవినీతిపరులుగా అభివర్ణించారో, వాళ్ళే.. ఉద్యోగ సంఘాల నాయకులు సముచిత నిర్ణయం తీసుకున్నారు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇదిలా వుంటే, ఇంకో పీఆర్సీ వచ్చే ఏడాదే వుంటుందనీ, అప్పుడు సత్తా చాటొచ్చనీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇదెక్కడి పంచాయితి.? అసలు రాష్ట్రం పరిస్థితేంటి.? జరుగుతున్న యాగీ ఏంటి.? ఎవరికీ బాధ్యత లేకుండా పోతోందేంటీ.!