మంత్రి అంబటి హ్యాపీ.! మీడియాలో స్పేస్ దొరికినందుకేనట.!

మంత్రి అంబటి రాంబాబు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. టీడీపీ అను’కుల’ మీడియాలో తనకు స్పేస్ దక్కిందంటూ తెగ సంబరపడిపోతున్నారు. వెటకారంగానే ఆ మాట అన్నాసరే, ఇది కాస్తా వైసీపీకి ఇబ్బందికరంగా మారిపోయింది. మరీ మంత్రులు కూడా ఇలా స్క్రీన్ స్పేస్ కోసం ఎదురుచూసే స్థాయికి దిగజారిపోయారా.? అన్న చర్చ జనాల్లో జరుగుతుండడమే అందుక్కారణం.

గడప గడపకీ మన ప్రభుత్వం.. పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ పిలుపునిచ్చారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఓట్లు పడింది.. కేవలం జగన్ మోహన్ రెడ్డిని చూసి మాత్రమే. వైఎస్ జగన్ సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. రాష్ట్రంలో విపక్షం పూర్తిగా అచేతనావస్థవలోకి వెళ్ళిపోయిందన్న కోణంలో అధికార పార్టీ నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

తమను గెలిపించిన ఓటర్లను వైసీపీ నాయకులు మర్చిపోయారు. దాంతో, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నా, పార్టీ పట్ల.. పార్టీకి చెందిన నేతల పట్ల ప్రజల్లో నెగెటివిటీ కూడా పెరిగిపోతున్న విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తెరిగారు.

దాంతో, జనంలోకి వెళితే వాళ్ళకి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయనే ఆలోచన చేశారు వైఎస్ జగన్. కానీ, జనంలో ఎదురువుతున్న నిరసన సెగతోనూ అధికార పార్టీ నేతల్లో మార్పు రావడంలేదు. ‘అబ్బే, ఆ నిరసనలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేస్తున్నవి..’ అంటూ బుకాయింపులకు దిగుతున్నారు. దానికి తోడు, ‘దుష్ట చతుష్టయం’ అనే మాటొకటి.

తన సొంత నియోజకవర్గంలో మంత్రి అంబటి నిరసన సెగ ఎదుర్కొన్నారు. దానికి కవరింగ్ ఇస్తూ, ‘ఇలాగైనా ఆ సెక్షన్ మీడియాలో నాకు స్పేస్ దక్కినందుకు హ్యాపీ..’ అంటూ భావదారిద్ర్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.