Minister Ambati : మంత్రి అంబటి రాంబాబు భలే ఛాన్స్ కొట్టేశారు. మంత్రి పదవి దక్కడమే లక్కు.. అనుకుంటే, జల వనరుల శాఖ దక్కడం మరింత అదృష్టంగా చెప్పుకోవాలేమో. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఈ శాఖను నిర్వహించారు.. అదీ చంద్రబాబు హయాంలో.
ఆ తర్వాత వైసీపీ హయాంలో ఈ శాఖ అనిల్ కుమార్ యాదవ్‌కి దక్కింది. ఇప్పుడు అంబటి ఈ శాఖకు మంత్రి అయ్యారు.
జల వనరుల శాఖ మంత్రి ఎందుకు అంత ప్రత్యేకమంటే, రాష్ట్రంలో ఓ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతోంది గనుక. జల వనరుల శాఖ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్రంతో లంకె.. అలాగే పొరుగు రాష్ట్రాలతోనూ లంకె.
ఇంతటి ప్రత్యేకతలున్న ఈ శాఖను సమర్థవంతంగా నిర్వహించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
పైగా, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు సరిగ్గా విడుదల చేయడంలేదాయె. ఈ విషయంలో అవసరమైతే కేంద్రం వద్దకు వెళ్ళాలి.. రాష్ట్ర ఆర్థిక మంత్రితో సమన్వయం చేసుకోవాలి. ఏం చేసినా, పోలవరం ప్రాజెక్టు అయితే ముందుకు నడిచేలా కనిపించడంలేదు.
ఎప్పుడో 2020 జూన్ నాటికే పూర్తి చేస్తామని వైసీపీ చెప్పుకుంది. అంతకన్నా ముందు 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని టీడీపీ చెప్పింది. ఇప్పుడు నడుస్తున్నది 2022. ఇంకో రెండేళ్ళలో ఎన్నికలొచ్చేస్తాయ్.
పూర్తిగా రెండేళ్ళ సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందా.? ఏమోగానీ, ఈ ప్రాజెక్టు పేరు చెప్పి అంబటి రాంబాబు నోటికి బోల్డంత పని అయితే వుంటుంది. మాటలు పక్కన పెట్టి చేతల్లో పని చేసి చూపిస్తే మాత్రం అంబటి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.