మంత్రి అంబటి, వైసీపీకి ముప్పు తెచ్చేలా వున్నారే.!

చిన్న విషయాలకు పెద్ద రాద్ధాంతం చేయడం, అవగాహనా రాహిత్యం.. ఇవన్నీ అంబటి రాంబాబులో చాలా మెండు. అనూహ్యంగా ఆయన మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆయన దేబిరించారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అంటూ పవన్ అభిమానుల ముందు అంబటి కంటతడి పెట్టినంత పని చేశారంటారు.

సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. పైకి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ, తెరవెనుకాల అభిమాన సంఘాల్ని లోబరచుకునేందుకు నానా తంటాలూ పడటం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందర్ని వైసీపీ నేతలు లోబర్చుకున్న వైనం అందిరకీ తెలిసిందే. ఈ విషయంలో అంబటి అగ్రగామి.. అంటారు.

పవన్ కళ్యాణ్ మీద 2019 నుంచీ నానా రకాల విమర్శలూ చేస్తూ వచ్చిన అంబటి, ఎట్టకేలకు మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. మంత్రి అయ్యాక, మరింతగా పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు చెలరేగిపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించే శాఖని అంబటికీ, అమర్నాథ్‌కీ సమానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంచారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

నిజానికి, పవన్ కళ్యాణ్‌ని రాజకీయాల్లో ‘జీరో’గా అభివర్ణిస్తున్న వైసీపీ, ఆ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి డజను మందికి పైగా ముఖ్య నేతల్ని మోహరించడమంటే చిన్న విషయం కాదు. మిగతావారి సంగతెలా వున్నా, అంబటి తడబడుతున్న తీరు వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తోందన్నది నిర్వివాదాంశం. ఈ విషయంలో మంత్రి అమర్నాథ్ పరిస్థితీ అంతే.

ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేసే మంత్రులు, ఆయా శాఖల పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారనే లెక్కల్ని జనం బేరీజు వేసుకోకుండా వుంటారా.?