ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఏ రోజుకి ఆ రోజు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ సందర్భంగా 10 వేలకు అటూ ఇటూగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. 30 వేలకు పెరగకూడదనే ఆశిద్దాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్క్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే, రాష్ట్రంలో కరోనా ఆంక్షలు కాస్త లేటుగా ప్రకటితమయ్యాయి ప్రభుత్వం నుంచి. అదే అసలు సమస్య. ప్రభుత్వం ఎలాగూ కఠినంగా నిబంధనలు అమలు చేయడంలేదు కాబట్టి, ప్రజలూ విచ్చలవిడిగా తిరిగేశారు. స్కూళ్ళను మూసివేయడం కూడా ఆలస్యమయ్యింది. నిన్నటివరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడతాయని ఎవరూ అనుకోలేదు. అదో పెద్ద సమస్య.
కరోనా తీవ్రత అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం ముందు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజలు రోడ్ల మీద తిరగడానికి అనుమతి. అదే సమయంలో వ్యాపార కార్యకలాపాలూ నిర్వహించేసుకోవాలి. ఆ తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. అంటే, ఆరు గంటలు మాత్రమే సాధారణ జీవితం.. అదీ 144 సెక్షన్ అమల్లో వుంటుంది. కానీ, ఆ తర్వాత పూర్తిగా కర్ఫ్యూనే. తప్పదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా తీవ్రతకు కళ్ళెం వేయడానికి ఇంకో మార్గమే లేదు. ప్రజలు, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించకపోతే, విపత్తు ముంచుకొచ్చేస్తుంది. అన్నట్టు, ఇది పెళ్ళిళ్ళ సీజన్. నిన్నటినుంచే ముహూర్తాలు షురూ అయ్యాయి. దాంతో, పెళ్ళిళ్ళ విషయమై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 50 మందికే అనుమతి.. అంటోంది ప్రభుత్వం.. అది నిన్నటి వ్యవహారం. రేపటినుంచి ఎలాంటి సరికొత్త నిబంధనలు తెరపైకొస్తాయో. లాక్ డౌన్ పెట్టలేం.. అని ప్రభుత్వం చెప్పుకొచ్చినా, ఇప్పుడు తప్పేలా లేదు. పేరు మాత్రమే మినీ లాక్ డౌన్.. నిజానికి, పూర్తిస్థాయి లాక్ డౌన్ లాంటిది అమలు కాబోతున్నట్టే లెక్క.