నరేంద్ర మోదీ.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు. భారత ప్రధానిగా ప్రపంచ దేశాల్లో మోదీకి బ్రహ్మాండమైన పాపులారిటీ ఉంది. మోదీ ఇంత పాపులర్ కావడానికి సోషల్ మీడియా మాధ్యమాలు కూడ ఒక కారణం. సోషల్ మీడియాలో యువత ఎక్కువగా అనుసరించే నాయకుడు మోదీనే కావడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో మోదీకి ఉన్న ఫాలోయింగ్ దేశంలో మరో నాయకుడికి లేదు. ప్రజలకు దగ్గరకావడానికి సోషల్ మీడియాను మోదీ వాడుకున్నట్టు ఏ లీడర్ కూడ వాడుకోలేదు. ఆయన ఏ పోస్ట్ పెట్టినా, ట్వీట్ చేసినా, వీడియో వదిలినా లక్షల్లో లైక్స్, షెర్స్ వస్తుంటాయి. ఆయన మీద ప్రత్యర్థులు సోషల్ మీడియాలో బురద చల్లాలని చేసిన అనేక ప్రయత్నాలు వృధా అయ్యాయి.
అలా ఇన్నాళ్లు మోదీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన సోషల్ మీడియా ద్వారా రెండు రోజులుగా ఆయనకు షాక్ మీద షాక్ తగలడం సంచలనం రేపుతోంది. ఆగష్టు 30న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తమ యూట్యూబ్ ఛానెల్ నందు ఉంచింది. ప్రతిసారి మోదీ కార్యక్రమానికి లైక్స్ ఎక్కువగా డిస్ లైక్స్ తక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి మన్ కీ బాత్ కు ఏకంగా మిలియన్ అంటే 10 లక్షల డిస్ లైక్స్ రాగా కేవలం 3 లక్షల పైచిలుకు లైక్స్ మాత్రమే వచ్చాయి. ఈ డిస్ లైక్స్ తో అత్యధికంగా డిస్ లైక్స్ పొందిన యూట్యూబ్ వీడియోగా ఇది రికార్డ్ సృష్టించింది.
ఎన్నడూలేని విధంగా సోషల్ మీడియాలో మోదీపై ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల వాయిదా గురించి చెప్పకపోవడం, ఆర్తిక వ్యవస్థ పతనం గురించి ప్రస్తావన లేకపోవడం వలన ఈ వ్యతిరేకత వ్యక్తమైందని అందరూ అంటుండగా ఇది కాంగ్రెడ్ కుట్రని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం ఇది దేశవ్యాప్తంగా మోదీ మీద మొదలైన వ్యతిరేకతకు నిదర్శనమని అంటున్నారు. ఇక తాజాగా మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేశారు. అనంతరం కోవిడ్ మీద పోరాడటానికి గాను పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని ట్వీట్లు వేశారు. ఇలా వరుసగా సోషల్ మీడియా ద్వారా తగిలిన షాక్స్ కషాయ దళాన్ని అయోమయంలో పడేశాయి.