అర్థరాత్రి హగ్: తప్పు ప్రియది కాదు, రవిదే.!

అర్థరాత్రి వేళ, రెస్ట్ రూమ్ దగ్గర లహరి, రవిని ఎందుకు హగ్ చేసుకుంది.? ఈ ప్రశ్న, ‘కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అన్నంత స్థాయిలో చర్చనీయాంశమయ్యింది బిగ్ బాస్ వీక్షకుల మధ్య సోషల్ మీడియా వేదికగా. సీనియర్ నటి ప్రియ, ఆ ప్రస్తావన తీసుకురావడం తప్పే. బిగ్ బాస్ మూడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రియ తెచ్చిన ఈ ప్రస్తావనతో వాతావరణం వేడెక్కింది.. ప్రియ కార్నర్ అయిపోయింది. రవి, లహరి.. ఇలా ఒకరేమిటి.? అందరూ ప్రియని తప్పు పట్టారు. ఆమె నోట తప్పుడు మాట వచ్చేసింది మరి. కానీ, అసలు సన్నివేశం వేరే వుంది. లహరి, తన వెంట పడుతున్న విషయాన్ని రవి స్వయంగా ప్రియకు చెప్పాడు.

చెప్పడమేంటే, బయటకు వెళ్ళాక యాంకర్ అవ్వాలనుకుంటున్న లహరి, అందుకోసమే తన వెంట పడుతోందనీ, ఎలా ఆమెను నిలువరించాలో అర్థం కావడంలేదనీ, హౌస్‌లో ఒంటరి మగాళ్ళు ఎంతమంది వున్నా, ఆల్రెడీ పెళ్ళయిన తన చుట్టూనే లహరి తిరుగుతోందనీ రవి, ప్రియ వద్ద వాపోయాడు. అదీ అసలు కథ. దీన్ని నేరుగా చెప్పాల్సిన ప్రియ, అది చెప్పకుండా.. లహరి, రవి.. రాత్రి వేళ, రెస్ట్ రూమ్ వద్ద కౌగలించుకున్న విషయాన్ని ప్రస్తావించి అడ్డంగా బుక్కయిపోయింది. నిజానికి, రవిని పూర్తిగా ప్రియ ఏకిపారేసి వుంటే, సీన్ ఇంకోలా వుండేది. అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఇలాంటివి జరుగుతున్నాయేంటి.? హోస్ట్ నాగార్జున ఏం చేస్తున్నాడు.? ఏం చేయబోతున్నాడు.? బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి చెత్త ప్రసారం కాకుండా ఆపలేకపోతున్నాడు.? కావాలనే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతోందా.? అన్న అనుమానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రవి చేసిన పనికి, నేరుగా అతన్ని గనుక ఈ వారం ఎలిమినేట్ చేసేస్తే.. బిగ్ బాస్ ఒకింత చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.