మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ టైమింగ్ అదుర్స్

Mega Star Chiranjeevi Political Timing

Mega Star Chiranjeevi Political Timing

ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. ఇంకో వైపు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక.. సరిగ్గా ఈ సమయంలోనే, అధికార వైసీపీకి ‘మెగా’ తీపి కబురు. మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వేటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ పరిశ్రమకు కాస్త ఊరట కలిగించేలా, థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. ఈ చర్యల్ని స్వాగతించారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం చిరంజీవి పెద్దన్న.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. మరోపక్క, అక్కనేని నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి, దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పనిలేదు. అయితే, ఎన్నికల ముందర.. ఆయా సినీ ప్రముఖుల అభిమానులు, అధికార పార్టీకి అనుకూలంగా మారేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నదాంట్లో కొంతైనా నిజం లేకపోలేదు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి టైమింగ్ కాదు.. అధికార వైసీపీ టైమింగే టైమింగ్.. అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అత్యంత వ్యూహాత్మకంగా జగన్ సర్కార్, ఎన్నికల ముందర సినీ పరిశ్రమకు వెసులుబాట్లు కల్పించిందనే చర్చ జరుగుతోంది. మరోపక్క, టీటీడీలో ఇటీవల జరిగిన వ్యవహారాల్ని కూడా ఎన్నికలతో ముడిపెడుతున్నారు కొందరు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అధికారంలో వున్నాక.. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా.? అన్నట్టు, మెగాస్టార్ చిరంజీవి ట్వీటు దెబ్బకి, బీజేపీ – జనసేన గందరగోళంలో పడ్డాయన్నది నిర్వివాదాంశం. పవన ప్రసంగాల కంటే, చిరంజీవి ట్వీట్ ఎక్కువ ప్రభావం చూపుతుందన్నది వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. మూడు రాజధానుల విషయంలోనూ జగన్ ప్రభుత్వానికి చిరంజీవి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.