అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడినా చెల్లుబాటు అవుతుంది. నేతలను లెక్కచేయకపోయినా, అవమానించినా గడిచిపోతుంది. అదే ఒక్కసారి అధికారం కోల్పోతే ఆ అవమానాలే శాపాలవుతాయి. సరిగ్గా ఇదే జరుగుతోంది టీడీపీ విషయంలో. అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కొందరు లీడర్లను అవసరార్థం వాడుకుని ఆ తర్వాత పక్కనపడేశారు. అలాంటి వారిలో విజయనగరానికి చెందిన మహిళా నేత మీసాల గీత ఒకరు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన మీసాల గీత తెలుగుదేశం పార్టీలో నిజాయితీగానే పనిచేశారు. 2009 ఎన్నికల్లో పరాజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఏంట్రీ ఇచ్చిన ఆమె ఆతర్వాత టీడీపీలో చేరారు.
2014లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంతో గెలుపొందారు. నియోజకవర్గంలో మంచిపేరు తెచ్చుకున్న ఆమెకు పదవీకాలం చివర్లో టీడీపీ నేతల నుండే ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీ నేతలు ఆమెను చాలా నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు సైతం 2019 ఎన్నికల్లో ఆమెను పక్కబెట్టి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గీత టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నుండి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో బాగా నొచ్చుకున్నారామె. ఆ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె ఓడిపోయింది. అప్పటి నుండి ఆమె నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు.
అప్పటికైనా మీసాల గీతను గుర్తించలేదు చంద్రబాబు. ఇటీవల జరిగిన పదవుల పంపకంలో కూడ ఆమెకు అన్యాయం జరిగింది. దీంతో గీత కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా పార్టీలో ఉంటూ అవమానాలు పడపాల్సిన అవసరం ఏముంది పార్టీని వీడటానికి డిసైడ్ అయ్యారట. అది కూడ ప్రత్యర్థి పార్టీ వైసీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారట. మీసాల గీత తన సామాజికవర్గంలో బలమైన లీడర్. ఆమె పార్టీని వీడితో టీడీపీకే నష్టం. వైసీపీలోకి వెళితే ఆ నష్టం రెట్టింపవుతుంది. ఈ సంగతి గమనించిన చంద్రబాబు ఆమెను కన్విన్స్ చేయడానికి మొక్కుబడి ప్రయత్నాలు చేశారట. కానీ గీత టైమ్ వచ్చింది కాబట్టి చంద్రబాబు మాటను లెక్కచేయకుండా పగ సాధిస్తున్నారట.