సినిమా బాగుంటే థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడతారనేది నిజం. ఇదే ప్రూవ్ అయింది ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ అనంతరం. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు జనం బాగా అలవాటుపడ్డాడు. ఆ ఫ్లో చూసి ఇక సినిమా హాళ్ళకు రోజులు చెల్లినట్టే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. థియేటర్లు ఓపెన్ చేయగానే సినీ ప్రేమికులు ఎగబడ్డారు. ఒక మాదిరిగా హిట్ అవ్వాల్సిన సినిమాలను సూపర్ హిట్ చేసి పెట్టారు. నెలకొక సినిమా చొప్పున విజయవంతం చేశారు. దాంతో థియేటర్లకు కాలం చెల్లిందనే అపోహ తొలగిపోయింది. ఇది హీరోలకు, నిర్మాతలకు కొండంత బలాన్ని ఇచ్చింది.
ఆ బలమే ఈ సెకండ్ లాక్ డౌన్ టైంలో పని చేస్తోంది. ఇంకో రెండు నెలల్లో సినిమా హాళ్లు తెరుచుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు హీరోలంతా. స్టార్ హీరోల సినిమాలంటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయి. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా మంచి బిజినెస్ చేసుకోగలవు. తలనొప్పి మొత్తం మధ్య స్థాయి హీరోలదే. వాళ్లకు సినిమా హాళ్లే కరెక్ట్. అక్కడే మంచి లాభాలు చూడగలరు. గత లాక్ డౌన్ టైంలో అయితే ఓటీటీలకు వెళ్ళడం గురించి చాలానే మదనపడ్డారు. కానీ ఈసారి ఆ కన్ఫ్యూజన్ లేదు. సినిమా హాళ్లు తెరుచుకంటే ఆడియన్స్ ఆదరిస్తారనే గురి కుదిరేసింది. అందుకే ఓటీటీల ఆఫర్లు ఇస్తున్నా నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు.