కరోనా పుణ్యమాని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఆ ట్రాఫిక్ గోలలు లేవు. పొద్దున లేవగానే ఆఫీసుకు పరిగెత్తడాలు లేవు. ఎవరి ఇంట్లో వాళ్లు ప్రశాంతంగా ఉన్నచోటు నుంచే కదలకుండా పని చేస్తున్నారు. దీంతో ఒకే చోట గంటల తరబడి కూర్చొని పనిచేయాల్సి వస్తోంది.
అయితే.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లలో ఎక్కువశాతం మంది.. తమ ల్యాప్ టాప్, డెస్క్ టాప్ పక్కన ఏదో ఒక ఫుడ్డు పెట్టుకొని టైమ్ పాస్ కోసం తింటుంటారట. అంటే వాళ్ల నోట్లో ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ ఉండాల్సిందే.
ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం… ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండటం.. దీర్ఘకాలికంగా ఇలాగే చేస్తూ పోతే వచ్చే సమస్యలను ఊహించడం కూడా కష్టమే అని చెబుతున్నారు నిపుణులు.
నిజానికి ఆఫీసుకు, ఇంటికి చాలా తేడా ఉంటుంది. ఆఫీసులో అయితే అలాగే చాలసేపు కుర్చీలో కూర్చోలేం. కనీసం గంటకు ఒకసారి అయినా లేవడమో.. లేదా కొలిగ్స్ తో మాట్లాడటమో చేస్తుంటాం. ఇంట్లో అలా ఏం ఉండదు. కూర్చుంటే అంతే.. ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే లేవకుండా కూర్చొని పనిచేసే వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఒకవేళ ఇలాగే కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనిచేస్తూ పోతే… విపరీతంగా ఊబకాయం వస్తుందట. దానితో పాటుగా… కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, వెన్నెముక వంగిపోవడం, రిపిటేటివ్ టైపింగ్ స్ట్రెస్, జుట్టు రాలిపోవడం, డార్క్ సర్కిల్స్, వెన్ను నొప్పి, చర్మంపై ముడతలు, ఒత్తిడి, చర్మం పొడిబారి పోవడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట.
ఇలాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే
అయితే.. దీర్ఘకాలం పాటు వర్క్ ఫ్రం హోం చేసినా కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని వర్కవుట్లను రోజూ చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. అంటే ఉదయం పూట కాసేపు నడవటం, రన్నింగ్ చేయడం లాంటివి చేయాలి. శరీరానికి అంతో కొంతో శ్రమ కలగాలి.
చాలామంది ల్యాప్ టాప్ పట్టుకొని బెడ్ మీదికి దూరుతారు. అది చాలా డెంజర్. బెడ్ మీద కూర్చొని అస్సలు పని చేయకూడదు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లు ఖచ్చితంగా ఒక డెస్క్ ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.