ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నడుమ సైలెంట్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఒప్పందాలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుండి తొలగించడం, ఇళ్ల పట్టాల పంపిణీ మీద అభ్యంతరాలు, రాజధాని తరలింపు మీద స్టే ఇవ్వడం లాంటి అనేక అంశాల విషయంలో హైకోర్టు అభ్యంతరాలు తెలపడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలంతా చంద్రబాబు నాయుడు హైకోర్టు నెహాసులను మేనేజ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. స్వయంగా జగన్ కులం పేరును ప్రస్తావిస్తూ న్యాయమూర్తుల తీరును తప్పుబట్టారు. జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబుతో కలిసి తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని నేరుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ దేశవ్యాప్తంగా చర్చకు దారీతీసింది.
జగన్ మీద కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని, ఆయన్ను సీఎం పదవి నుండి తొలగించాలని కొందరు న్యాయవాదులు డిమాండ్ చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. చీఫ్ జస్టిస్ మీద చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఈమేరకు ఢిల్లీ పెద్దలతో నిత్యం టచ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన నాయ్యమూర్తులను బదిలీ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తీర్మానించింది.
నిజానికి న్యాయమూర్తుల బదిలీ అనేది సాధారణ విషయమే. కొలీజియమే బదిలీలపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏపీతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడ బదిలీ చేశారు. కానీ సీపీఐ నారాయణ మాత్రం నిన్న హైకోర్టు న్యాయమూర్తులను మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రానికి జగన్ మద్దతిస్తున్నందువల్లే కేంద్రం కూడా జగన్ రాసిన లేఖ విషయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించి బదిలీలను రంగం సిద్ధం చేసిందని అనడంతో వ్యవహారం చర్చనీయాంశమైంది. పైగా ఈ బదిలీ చర్చలు, నిర్ణయాలు జగన్ ఢిల్లీ పర్యటన పూర్తిచేసుకున్న తదుపరి రోజునే జరగడంతో ప్రత్యర్థి పార్టీలు వాటిని కూడ ఎత్తిచూపుతూ జగన్ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి బదిలీల అంశం మీద పట్టుబట్టి మరీ పనిచేయించుకున్నారని, ఆయన ఢిల్లీ టూర్ ప్రధాన లక్ష్యం ఇదేనని అంటున్నారు.
మరి జగన్ ఢిల్లీ టూర్, న్యాయమూర్తుల బదిలీలు ఒకదాని తర్వాత ఒకటి యాథృచ్ఛికంగా జరిగినవా లేకపోతే ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ఇదంతా జగన్ కేంద్రం పెద్దలతో చేయించుకున్న ఫెవర్ అని, ఉద్దేశ్యపూర్వకంగానే న్యాయమూర్తి బదిలీ జరిగిందని పదవి చేపట్టిన ఏడాదికే జస్టిస్ మహేశ్వరికి స్దాన చలనం ఎలా సాధ్యమని తప్పకుండా ఆరోపణలు లేవనెత్తుతుంది.