ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అద్భుతమైన పరిపాలన సాగిస్తూ ప్రజల చేత మన్నలను పొందుతున్నాడు, ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా విజయం ఖాయమని భావిస్తున్నారు, ఒక పక్క జగన్ ఈ స్థాయిలో దూసుకొని వెళ్తుంటే మరోపక్క జగన్ కు చెడ్డ పేరు తీసుకోని వచ్చే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో జరుగుతున్నా అఘాయిత్యాలు మూలంగా చెడ్డపేరు వస్తుంది. ప్రజలను కంటికి రెప్పగా కాపాడవలసిన పోలీసులు వాళ్ళమీదే జులం ప్రదర్శిస్తుంటే ఇక ప్రజలకు దిక్కెవరు..?
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ (45), భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3న పాణ్యం వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగు లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
గత నెలలో రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్‌జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు నిందితులను తరలిస్తూ వారి చేతులకు సంకెళ్లు వేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. జగన్ సర్కార్ తీవ్ర విమర్శలపాలైంది. జూలైలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర్లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో వెండుగమిల్లి ప్రసాద్ అనే దళిత యువకుడిని అవమానించారు. స్టేషన్లో ఇన్‌చార్జి ఎస్ఐ షేక్ ఫిరోజ్ ఆ యువకుడికి ట్రిమ్మర్ తో గుండు చేయించారు. ఇలా అనేక సంఘటనలు జగన్ సర్కార్ కు చెడ్డ పేరు తీసుకోని వచ్చాయి.
ఇందుకు భాద్యులైన పోలీసుల మీద నామమాత్రవు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. అమరావతి రైతులకు సంకెళ్లు వేయడంలో ఎస్కార్టు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భావించి గుంటూరు గ్రామీణ జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఎనిమిది మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఎస్కార్టు పర్యవేక్షణలో ఉన్న ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు చార్జి మెమోలు ఇచ్చారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకే సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడం గమనార్హం.
ఇక ప్రకాశం జిల్లాలో కిరణ్‌కుమార్ అనే యువకుడు మాస్క్ ధరించలేదనే కారణంతో చీరాల టూటౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ చావబాదాడు. అతన్ని చీరాల ఏరియా వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కిరణ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పుకుంటే అనేక సంగటనలు వున్నాయి. ఇవన్నీ బయటకు వచ్చినవే, కానీ బయటపడనవి ఇంకా చాలానే వున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు , కాబట్టి ఇలాంటి విషయాల్లో సీఎం జగన్ ఉక్కు పదం మోపాల్సిన అవసరం వుంది.