జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురైంది. రామతీర్ధం వివాదం సమయంలో సంఘటనా స్థలానికి చంద్రబాబుతో పాటు అశోక్ గజపతి రాజు కూడా వెళ్ళిన సందర్భంలో రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయన్ను రామతీర్ధం ఘటనకు బాధ్యుడిని చేస్తూ, పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మాన్సాస్ చైర్మెన్ గా అయన్ను తొలగించటం దగ్గర నుంచి, మొన్న రామతీర్ధం ఘటన వరకు ఏదో ఒక విధంగా అశోక్ గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం తీసుకున్న చర్య పై, అశోక్ గజపతి రాజు , హైకోర్టులో చాలెంజ్ చేసారు. ఎండోమెంట్ ఆక్ట్ ప్రకారం, ఏదైనా తప్పు చేస్తే, ముందుగా నోటీసులు జారీ చేసి, సంజయషీ తీసుకుని నోటీసులు జారీ చేయాలని, అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే, నిర్ణయం తీసుకుందని ఆయన పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టేసింది. రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు కొనసాగనున్నారు. అశోక్ గజపతి రాజు పై ప్రభుత్వం వేధిస్తున్న తీరుకి, ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అనే చెప్పాలి.
“రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా నన్ను తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ వారు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. ఈ రోజు రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట అని టీ.వి. వార్తల ద్వారా తెలిసింది. ఈ శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే నన్ను ఆశీర్వదించి ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్ళీ కలిగించారు అని భావిస్తున్నాను” అని అశోక్ గజపతి రాజు ట్విట్టర్ లో స్పందించారు. రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న వేళ అశోక్ గజపతి రాజు గారికి ఊరట లభించడంతో ఆయన అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.