టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని జైలుకు పంపేందుకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న సంకేతాల్ని వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పంపుతున్నారు. ‘అశోక్ గజపతిరాజు మన్సాస్ ట్రస్టుకి మాత్రమే ఛైర్మన్. విజయనగరం మొత్తానికి రాజు కాదు.. వందల ఎకరాలు దోచుకున్న వ్యక్తి ఆయన.. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం వుంది..’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మన్సాస్ ట్రస్టు వ్యవహారం వివాదాస్పదమయ్యిందే వైఎస్సార్సీపీ హయాంలో.
అశోక్ గజపతిరాజుని కాదని, ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను నిబంధనలకు విరుద్ధంగా మన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ హోదాలో కూర్చోబెట్టింది వైఎస్ జగన్ సర్కార్. ఈ విషయమై అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. అయినా, అధికార పార్టీలో కొందరు నేతల అత్యుత్సాహం కారణంగా తప్పిదాలు జరిగాయన్న వాదనలున్నాయి. అది వాస్తవమేనని కోర్టు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని కొట్టేయడంతో తేటతెల్లమైపోయింది. పనిగట్టుకుని వైసీపీలోనే కొందరు, వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ప్రభుత్వ పెద్దలు తప్పక కొన్ని నిర్ణయాల్లో రిస్క్ తీసుకోవాల్సి వస్తోందన్న చర్చ ఉత్తరాంధ్రలో బలంగా వినిపించింది.. అదీ మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో.
ఇక, అశోక్ గజపతిరాజు కోర్టు తీర్పు తర్వాత తిరిగి మన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అయ్యారు. ఇంతలోనే, అశోక్ గజపతిరాజు అరెస్టవడం ఖాయమంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఓ పక్క వైసీపీ అధినాయకత్వం, ‘మేం రాజకీయ కుట్రలకు వ్యతిరేకం..’ అని అంటోంటే, ఇంకోపక్క, ‘జైలుకు పంపి తీరతాం..’ అంటూ వైసీపీ ముఖ్య నేతలే వ్యాఖ్యానిస్తుండడాన్ని ఏమనుకోవాలి.?