మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు మరోసారి టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై కుట్రలు చేసిన వారిలో ఒకరైన అశోక గజపతి.. ఆయన వర్ధంతి సందర్భంగా కొనియాడ్డం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘ పార్టీపెట్టుకుని సొంతకాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవినుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో చంద్రబాబు గారితో పాటు అశోక్ గజపతి రాజు గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది.
ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతి రాజు గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా, ఆ లేఖలో మొత్తం ఐదుగురి తెలుగు దేశం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, ఆశోక్ గజపతి రాజు, విధ్యాదర్ రావు, దేవేందర్ గౌడ్, మాధవ రెడ్డిలను పార్టీనుంచి తొలిగిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయం తీసుకుంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపారు.