మన్సాస్ రగడ: వైసీపీ సర్కారుకి మరో షాక్.?

మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏదీ కలిసి రావడంలేదు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్దలు ఎందుకు జోక్యం చేసుకోవడం.? అన్న చర్చ ఉత్తరాంధ్ర వర్గాల్లో బలంగా వినిపిస్తూనే వుంది చాలా కాలంగా. నిజానికి, ఈ రోజుల్లో ఇలాంటి ట్రస్టు వ్యవహారాల్నీ, రాజకీయాల్నీ వేరు చేసి చూడలేం. అయితే, మన్సాస్ పరిస్థితి వేరు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మీద ఉత్తరాంధ్రలో ఒకింత పాజిటివ్ ఇమేజ్ వుంది. మన్సాస్ ట్రస్టు విషయంలో చాలా గౌరవం వుంది అక్కడి ప్రజలకి. బీజేపీకి చెందిన సంచయితను రంగంలోకి దించిన వైసీపీ, బీజేపీ నేతల మద్దతుని సైతం పొందలేకపోయింది మన్సాస్ విషయంలో.

అశోక్ గజపతిరాజుని అవమానపర్చేలా ఆయన్ని తొలగించి, సంచైతను తీసుకురావడంతోనే వైసీపీ, పెద్ద తప్పిదానికి పాల్పడింది. ‘అబ్బే, ఆ ట్రస్టు వ్యవహారాలతో మా ప్రభుత్వానికి సంబంధం లేదు..’ అని వైసీపీ చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇక, తాజాగా మన్సాస్ ట్రస్టుకి సంబంధించి కొందరు ఉద్యోగులకు జీతాల విషయమై ఈవో కారణంగా రగడ నెలకొంది. అశోక్ గజపతిరాజు, ఈవో తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దానిపై ప్రభుత్వ పెద్దల వాదన కూడా చిత్రంగా కనిపించింది. ట్రస్టులో అవకతవకలంటూ అధికార పార్టీ పెద్దలు ఆడిట్ వ్యవహారాలకు తెరలేపారు. బయటి వ్యక్తులకు ట్రస్టు కార్యకలాపాలతో సంబంధమేంటి.? అంటూ న్యాయస్థానం తాజాగా తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేని ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి లంకె పెడుతున్నది అధికార పార్టీ నేతలే. ఆ కారణంగా జగన్ సర్కారుకి పదే పదే చుక్కెదురవుతోంది, ప్రజల్లో పార్టీ పలచనవడానికీ కారణమవుతోంది.