సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అయితే, కోలుకుంటాడనుకున్న కత్తి మహేష్, అనూహ్యంగా ఎలా ప్రాణాలు కోల్పోయాడన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. తొలుత ఓ కన్ను తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత, కన్ను తొలగించే అవసరం కూడా రాదని వైద్యులే చెప్పారంటూ వార్తలొచ్చాయి. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కత్తి మహేష్ వైద్య చికిత్సల నిమిత్తం 17 లక్షలు విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతలోనే కత్తి మహేష్ మరణ వార్త బయటకొచ్చింది. ఈ పదిహేను రోజుల్లో అసలేం జరిగింది.? కత్తి మహేష్ ఎందుకు కోలుకోలేకపోయాడు.? ఈ అంశాలపై జనంలో చాలా అనుమానాలున్నాయి.
ఆ అనుమానాలకు ఇంకాస్త ఊతమిచ్చేలా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరికి వ్యతిరేకంగా కత్తి మహేష్ పెద్ద పోరాటమే చేశాడనీ, ఈ క్రమంలో ఆ కొందరు ఆయన్ని టార్గెట్ చేసి వుండొచ్చనే అనుమానం కలుగుతోందని మందకృష్ణ అన్నారు.
కత్తి మహేష్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగ్గా, ప్రమాదంలో డ్రైవర్ గాయాల పాలవకపోవడం, ఇంకో వైపు కూర్చున్న కత్తి మహేష్ మాత్రమే గాయపడటమూ అనుమానాస్పదంగా కనిపించింది మందకృష్ణ మాదిగకి. అయితే, ఇదంతా కత్తి మహేష్ మీద అభిమానంతోనే మందకృష్ణ చేస్తున్న ఆరోపణల పర్వంగా చూడాలా.? లేదంటే, ఇందులోంచి కూడా రాజకీయ లబ్ది పొందాలని ఆయనేమైనా అనుకుంటున్నారా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.