భూమిని తవ్వడం ఎంత కష్టమో.. వ్యవసాయం చేసేవాళ్లను, కూలినాలి చేసేవాళ్లను అడిగితే తెలుస్తుంది. కొంచెం భూమి తవ్వితేనే చెమటలు కక్కుతాం. ఎండలో అయితే చాలా కష్టం. ఒక్క రోజు కొంత భూమి తవ్వితేనే చేతులు కందిపోతాయి. జన్మలో గడ్డపార పట్టుకోరు కొందరు. అంత కష్టమైన పని అది. అంత కష్టమైన పనిని తన ఊరి కోసం 30 ఏళ్ల పాటు ఏమీ ఆశించకుండా చేశాడు ఓ పెద్దాయన. ఆయన ఇఫ్పుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. పదండి ఓసారి ఆయన్ను కలిసివద్దాం..
అది బీహార్ లోని గయా జిల్లా. అదే జిల్లాలోని కొథిల్వా గ్రామానికి చెందిన లావుంగీ భుయాన్. తన జీవితం మొత్తాన్ని ఒక కాలువ తవ్వడం కోసమే అర్పించేశాడు. అది ఏదో తన కోసం కాదు.. తన సొంత వాళ్ల కోసం కాదు.. తన ఊరు బాగుపడాలని.. తన ఊరుకు సాగునీరు రావాలన్న సదుద్దేశంతో ఆ పని చేశాడు లావుంగీ.
నిజానికి ఆ ఊరు చుట్టూ కొండలే. ఆ ఊరుకు వెళ్లాలన్నా సరే.. కొండలను దాటుకొని వెళ్లాలి. కొండను తొలిచే ఆ ఊరుకు రోడ్డు కూడా వేశారు. కానీ.. ఆ ఊరుకు సాగునీరు మాత్రం రావడం చాలా కష్టంగా మారింది. కష్టపతే రైతన్నలు ఉన్నా.. వర్షం పడుతున్నా… ఆ ఊళ్లో మాత్రం చుక్క నీరు దొరకదు. కారణం చుట్టూ కొండలు ఉండటం.
ఇలా అయితే ఈ ఊరు వల్లకాడు కావడం ఖాయం అని అనుకున్న భుయాన్.. 30 ఏళ్ల క్రితం ఆ ఊరికి కాలువ తవ్వడం ప్రారంభించాడు. తను ఈ పని ప్రారంభించే ముందు ఎవ్వరినీ సాయం కోరలేదు. ప్రభుత్వాలనూ నిందించలేదు. తను ఓ అడుగు ముందుకేశాడు అంతే.
రోజు ఉదయం లేవగానే.. తన దగ్గర ఉన్న పశువుల్ని కొండల దగ్గర వదిలేస్తాడు. వెంటనే వెళ్లి కాలువ తవ్వకాన్ని ప్రారంభిస్తాడు. సాయంత్రం వరకు నిర్విరామంగా భుయాన్ కాలువ తవ్వుతూనే ఉంటాడు. అతడు కాలువ తవ్వుతుంటే చూసిన ఆ ఊరి జనాలు.. ఈయనకు ఏం పనిలేదా? అని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు తప్పితే ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఊళ్లో చెరువు ఉన్నప్పటికీ అందులో చుక్క నీరు లేకపోవడం ఆయనకు సహించలేదు. అలా 30 ఏళ్ల నుంచి ప్రతి రోజు ఇదే పని. లేవడం.. పశువులను మేతకు వదిలేయడం.. చీకటి పడేవరకు కాలువ తవ్వడం. అలా 30 ఏళ్ల పాటు కాలువ తవ్వి ఇప్పుడు ఆ ఊరును పచ్చగా చేశాడు భుయాన్. 3 కిలోమీటర్ల కాలువను ఒక్కడే తవ్వేశాడు.
ఆయన తవ్విన కాలువ ద్వారా నీళ్లు వచ్చి ఆ ఊరి చెరువును నింపేస్తాయి. అలాగే కాలువ పొడవునా.. సాగు నీరు కావల్సిన రైతులు వాటిని వాడుకుంటారు. ఇప్పుడు ఆ ఊరు చెరువు నిండిపోయింది. కావాల్సినంత సాగునీరు. ఇదంతా భుయాన్ కృషి వల్లే జరిగింది.
భుయాన్ చేసిన పని గురించి తెలుసుకున్న ఓ టీచర్.. భుయాన్ గొప్పతనాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని మీడియాకు వెల్లడించడంతో.. ప్రస్తుతం భుయాన్ బీహార్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆ ఊరి ప్రజలు కూడా ఇప్పుడు భుయాన్ ను మెచ్చుకుంటున్నారు.