పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోమారు విజయం సాధించడం, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనా, ముఖ్యమంత్రి పదవి చేపట్టడం తెలిసిన వ్యవహారాలే. ఆమె ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చారో లేదో, అలా కేంద్రం మరోమారు తన పంజా విసిరేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలంటూ ‘గవర్నర్’కి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ.
నిజానికి, ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలనేవి ఆ రాష్ట్ర అంతర్గత వ్యవహారాలు. పరిస్థితి చెయ్యి దాటితేనే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వుంటుంది.. అదీ చాలా ప్రత్యేక సందర్భాల్లో. కానీ, బీజేపీ.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నది సాధించలేకపోయింది. దాంతో, ఎలాగైనా పశ్చిమ బెంగాల్ మీద పెత్తనం చెలాయించడం కోసం గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటోందన్నమాట. బీజేపీ తీరుపై మమతా బెనర్జీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా తాను పదవీ ప్రమాణం చేసి 24 గంటలైనా కాకుండానే గవర్నర్ వ్యవస్థ ద్వారా తనను అదుపు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారామె. ఎన్నికల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన మమతా బెనర్జీ, ఆయా కుటుంబాలకు నష్ట పరిహారం కూడా ప్రకటించారు.
చనిపోయినవారిలో బీజేపీతోపాటు తమ పార్టీకి చెందినవారూ వున్నారన్నది మమతా బెనర్జీ వాదన. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, తాము గెలిచిన నియోజకవర్గాల్లో అలజడి రేపేందుకు బీజేపీ, కుట్ర పూరిత చర్యలకు పాల్పడుతోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. అసాంఘీక శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారామె. మరి, మోడీ వర్సెస్ మమత.. ఎన్నికలయ్యాక కూడా ఈ రాజకీయ యుద్ధం షురూ అయిన దరిమిలా, పై చేయి ఎవరిది అవుతుందో వేచి చూడాలి.