2024 ఎన్నికలు దేశానికి, నరేంద్ర మోడీకి మధ్య జరుగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. అత్యంత సంచలన వ్యాఖ్య ఇది. ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోడీని, దేశానికి వ్యతిరేకం.. అన్నట్టుగా ఆమె వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుందిక్కడ. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ కలిసిన విషయం విదితమే. నేడు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికల నాటికి, నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావాలన్నది మమతా బెనర్జీ ఉవాచ. ఇదే విషయాన్ని ఆమె, సోనియాని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
త్వరలో మరిన్ని సమావేశాలు వివిధ పార్టీలకు చెందిన అధినేతలతో జరుగుతాయని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ‘ప్రధాని అభ్యర్థి 2024 ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఎవరు అవుతారు.? అన్నదానిపై ముందు ముందు స్పష్టత వస్తుంది..’ అని మమతా బెనర్జీ చెబుతున్నప్పటికీ, మోడీకి ధీటైన నేత దేశంలో మమతా బెనర్జీ మాత్రమేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ప్రధాని పీఠం మీద కన్నేయడం.. ఫెడరల్ ఫ్రంట్.. అనే ప్రతిపాదన తీసుకురావడం, ఈ క్రమంలో మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి తదితర నేతల్ని కలవడం తెలిసిన విషయాలే. కానీ, ఎందుకో కేసీయార్, ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ విషయమై ఆసక్తి చూపలేదు. సందర్భానుసారం మోడీని పొగుడుతున్నారు కూడా. దాంతో, మోడీతో పోటీ పడే నాయకుల లిస్టులోంచి కేసీయార్ పేరు మాయమైపోయింది.