తెలంగాణ రాజకీయం గత రెండు మూడు రోజులు వేడి వేడిగా నడిచింది. సభలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తెరాస, కాంగ్రెస్ పార్టీల నడుమ వాదన నడిచింది. గ్రేటర్లో లక్ష ఇళ్లు ఎక్కడ కడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటే కావాలంటే రండి చూపిస్తాం అంటూ తెరాస సవాల్ చేసింది. దానికి కాంగ్రెస్ కూడ సై అంది. మామూలుగా అయితే ఇలాంటి సవాళ్లు సభల వరకే పరిమితమవుతాయి. కానీ తెరాస ఈసారి వారిని ఆచరించి చూపాలని అనుకుందో ఏమో తెలీదు కానీ ఆ మరుసటిరోజు కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు నగరంలో ఇళ్లు చూపాలని డిసైడ్ అయింది. తెరాస ముఖ్య నేత తలసాని శ్రీనివాస యాదవ్ రంగంలోకి దిగారు.
నేరుగా భట్టి ఇంటికి వెళ్ళి ఆయన్ను వాహనంలో ఎక్కించుకుని నగరంలో తిప్పి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించారు. రెండు రోజులు ఇదే పద్దతి నడిచింది. మీడియాలో తెరాస మీద పెద్ద ఎత్తున పొగడ్తలు, గొప్పలు ప్రచురితమయ్యాయి. ఇలా ఆన్ ఫీల్డ్ బరిలోకి దిగి ప్రతిపక్షానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని, ఇది కేసీఆర్ ధైర్యానికి, నిజాయితీకి నిదర్శనమని హైప్ ఇచ్చారు. ఇక భట్టి విక్రమార్క సైతం తలసానితో తిరిగిన రెండు రోజులూ సైలెంట్ గానే ఉన్నారు. దీంతో నిజంగానే తలసాని ఆయనకు లక్ష ఇళ్లు చూపించి, ఆశ్చర్యపరిచి ఉంటారని, కేసీఆర్ వేసిన ముందడుగుతో కాంగ్రెస్ కళ్లు తిరిగి ఉంటాయని అన్నారు.
కానీ అక్కడ జరిగింది వేరు. తలసాని తిప్పిన చోటుకల్లా వెళ్ళిన భట్టి విక్రమార్క ప్రభుత్వం కట్టిన ఇళ్లు మారలేదు కానీ ఎన్నికలే మారిపోతున్నాయి అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు ఏ ఇళ్లను చూపెట్టి ఓట్లు దండుకున్నారో ఇప్పుడు కూడ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వాటినే చూపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష ఇళ్లు కడతామని ప్రభుత్వం కట్టింది 3,428 ఇళ్లు మాత్రమేనని, తనకు గ్రేటర్ పరిధిలో కనిపించింది అవి మాత్రమేనని, మిగిలిన ఇళ్లు ఎక్కడని ప్రశ్నించారు. మరి కేసీఆర్ కారు ఎక్కించి నాలుగు రౌండ్లు తిప్పుతే ప్రతిపక్షం సైలెంట్ అవుతుందని కేసీఆర్ అనుకున్నారో ఏమో కానీ చివరకు భట్టి మాత్రం ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇచ్చారు.