తనయుడు నారా లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు మొదట్లో ఏదేదో ఊహించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపకుండా ఎమ్మెల్సీని చేసి తరవాత మంత్రిని చేసేశారు. ఒకేసారి మంత్రి అయిపోతే కుమారుడు రాజకీయ క్షేత్రాన్ని దున్నిపారేస్తాడని ఆశపడ్డారు. కానీ సీన్ తిరగబడింది. లోకేష్ దున్నడం కాదు కదా బొక్కబోర్లాపడ్డారు. అధికారాన్ని, పదవిని సద్వినియోగం చేసుకోలేక జనం దృష్టిలో సాదాసీదా నాయకుడిగా మిగిలిపోయారు. ప్రజలకు దగ్గరవ్వడంలో, వైసీపీని ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. దీంతో ఖంగుతినడం బాబుగారి వంతైంది.
ఎన్నికలకు ముందు కుమారుడ్ని ఎలాగైనా సానబెట్టాలని బాబుగారు బాగా కష్టపడ్డారు. అవేవీ సత్పలితాలని ఇవ్వలేదు. కానీ ఓటమి మాత్రం ఆయనకు చాలా పాఠాలే నేర్పింది. చాలామంది నాయకుల్లా తాను కూడ ఓడిపోవడం లోకేష్ ను ఆలోచనలో పడినట్టే ఉంది. ఆ ఓటమితో చంద్రబాబు కుమారుడనే ప్రతిష్ట దెబ్బతింది. వైసీపీ వేసిన అవహేళన ముద్రకు మరింత బలం చేకూరినట్టైంది. అందుకే లోకేష్ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఓటమి నుండే పైకి ఎదగాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గతంలో మాదిరి ఎవరో బ్రీఫింగ్ ఇస్తే పరిస్థితుల గురించి, రాజకీయాల గురించి తెలుసుకోవడం మానేశారు. స్వయంగా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. సొంతగా సమీక్షలు చేసుకుంటున్నారు.
గతంలో మాదిరి అన్నింటికీ తండ్రి పక్కన నిలబడటం కాకుండా తానే బాధ్యతలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒంటరిగానే పర్యటనలు చేయడం స్టార్ట్ చేశారు. కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన నేతలను ఒక్కరే వెళ్లి పరామర్శించారు. వర్షాలతో నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లి మంచే చెడు కనుకకుంటున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు జరుపుతూ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో సొంత నిర్ణయాలను చెబుతున్నారు. కొంచెం విషయ పరిజ్ఙానం కనబరుస్తున్నారు. పాలక వర్గం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలను సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతి విషయాన్నీ పెద్దది చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారు.
ఇలా లోకేష్ బాబులో వచ్చిన మార్పుకు నేతలే కాదు చంద్రబాబు సైతం ఆశ్చర్యపోతున్నారట. ఏళ్లతరబడి ముందుకు తోసినా పుంజుకోలేకపోయిన లోకేష్ ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే మారిపోయి రాటుదేలిపోవడం చూసిన టీడీపీ లీడర్లకు, చంద్రబాబుకు ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో నిర్భయంగా పార్టీ పగ్గాలను అందించవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. మరి ఈ పెను మార్పుకు కారణం ఏమిటయ్యా అంటే వరుసగా తగిలిన ఎదురుదెబ్బలేనని, ఆ గాయాలే లోకేష్ ను రాటుదేల్చాయని టీడీపీ ముఖ్య నేతల పరిశీలనలో తేలిందట. పవర్ ఉన్నప్పుడు గాల్లో తేలిన ఆయనకు ప్రతిపక్షంలో పడ్డాక గ్రౌండ్ రియాలిటీ తెలిసొచ్చిందని, సొంత ఇమేజ్ తాలూకు ప్రాముఖ్యత అవగతమైందని అదే ఈ మార్పుకు కారణమని చెబుతున్నారు.