పవన్ కళ్యాణ్ తాను కులాన్ని చూసుకుని రాజకీయాల్లోకి రాలేదని పదే పదే చెబుతుంటారు. నేను కాపునని ఎవరు చెప్పారు.. నేను భారతీయుడ్ని అంటూ పవన్ పలుమార్లు సభా వేదిక మీదనే గొంతు చించుకున్నారు. అయినా ఆయనకు కులాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. కాపు సామాజికవర్గం కూడ పవన్ మనవాడు అనుకుంటూ గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. జనసేన పడిన ఓట్లలో మెజారిటీ ఇట్లు కాపు వర్గం నుండి వచ్చినవే. అయితే కాపు సామాజికవర్గం పూర్తిస్థాయిలో జనసేన వైపు మళ్ళలేదు. అదే జరిగుంటే ఫలితాలు ఆ తరవాత పరిస్థితులు వేరేలా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ నందు కుల ప్రాతిపదికన రాజకీయాలు నడవడం అనేది తరాల తరబడి వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయం నుండి పవన్ కూడ తప్పించుకోలేకపోయారు.
అందుకే గత ఎన్నికల్లో తన సామాజివర్గం ఎక్కువగా ఉండే రెండు చోట్ల నుండి పోటీచేశారు. అయితే పార్టీలో మాత్రం ఏనాడూ కుల సమీకరణలకు తావివ్వలేదు ఆయన. మిగతా పార్టీల అధినేతల్లా సొంత సామాజికవర్గం వారినే దగ్గర పెట్టుకుని, ఇతరులను నామ్ కే వాస్తే పార్టీలో ఉంచుకోవడం చేయలేదు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నాడని అనిపిస్తే తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు కూడ అదే చేస్తున్నారు. జనసేనలో కుల సమీకరణాలు నడవట్లేదు కాబట్టే పార్టీ ఇంకా నాయకుల లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అదే మిగతా వారి మాదిరిగానే పవన్ కూడ సొంత కులాన్ని మాత్రమే ఎంకరేజ్ చేసినట్లైతే కాపు నాయకులతో పార్టీ ఎప్పుడో నిండి ఉండేది. ఇన్ని చూసిన తర్వాత కూడ ప్రత్యర్థులు పవన్ మీద ఆ కుల చిచ్చుతోనే దాడికి చేయాలని ప్రయత్నిస్తున్నారు.
జనసేనలో పవన్ తర్వాత ఎక్కువగా ఎలివేట్ అవుతున్న నేత నాదెండ్ల మనోహర్. పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ వెంటే ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్న వ్యక్తి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పదవిలో ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తున్నారు. అందుకే పవన్ ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జనసేన నాయకులు, శ్రేణులు సైతం నాదెండ్ల పట్ల సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఆయనతో ప్రత్యర్థి వర్గాలకే సమస్య వచ్చినట్టుంది. అందుకే నాదెండ్ల కులాన్ని ప్రస్తావిస్తూ జనసేనలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. కానీ జనసేనలో చేరినప్పటి నుండి నాది పలానా కులమని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన అనకపోతే ఏం.. అనడానికి మేమున్నాం కదా అంటూ తయారయ్యారు ప్రత్యర్థులు.
పవన్ నాదెండ్లకు ప్రాముఖ్యత ఇస్తుండటం వలన జనసేనలో కాపుల కడుపు రగిలిపోతోంది ప్రచారం స్టార్ట్ చేశారు. కాపులను పక్కన తిప్పుకోకుండా కమ్మ వ్యక్తిని ఆదరిస్తుండటం కాపు శ్రేణులకు నచ్చడంలేదట. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కాపులు నాదెండ్ల వ్యవహారం చూసి తట్టుకోలేకపోతున్నారని, అందుకే పార్టీకి దూరం జరగాలని భావిస్తున్నట్టు ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేశారు. వీరి ఉద్దేశ్యమల్లా ఒక్కటే. వైసీపీలో రెడ్డి వర్గం డామినేషన్, టీడీపీలో కమ్మ నేతలు ఆధిపత్యం ఉంది. అది ఆయా పార్టీలను అభిమానిస్తున్న ఇతర వర్గాలకు నచ్చట్లేదు. పార్టీ అధ్యక్షుల తీరులో మార్పు రావాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. జనసేనను చూపించి అలా ఉండొచ్చు కదా అంటున్నారు. అది నచ్చని సదరు పార్టీల అనుకూల మీడియా జనసేనలో కాపు వర్గాన్ని రెచ్చగోట్టి కుల చిచ్చు పెట్టేస్తే తమ సమస్య తీరిపోతుందనే భ్రమలో కాపులు వెర్సెస్ కమ్మలు అంటూ చెత్త టాపిక్ పట్టుకుని చిడతలు కొడుతున్నారు.