పక్కచూపులు చూస్తున్న మాగంటి బాబు

ఇప్పుడు అంతా సీజనల్ పాలిటిక్స్ కదా… ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల చెంతకు చేరడం ఇప్పుడున్న ట్రెండ్. ప్రతిపక్షంలో ఉండడం, ప్రజాసమస్యలపై పోరాడడం మళ్లీ అధికారంలోకి రావడం అంతా పాత పద్దతి. ఎవరు గెలిస్తే వారి వద్ద వాలిపోయి మళ్లీ అధికారం చెలాయించడం కొత్త పద్ధతి. దేశమంతా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనే ఫిలాసఫీ మన నాయకులది. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. ఈకోవకే చెందిన మరో ఘటన  పశ్చిమ గోదావరిలో చోటుచేసుకోబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2014  ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ విజయఢంకా మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. మాగంటి బాబు కూడా ఏలూరు నుంచి టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే  2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో జిల్లాలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఈ కారణంగా ఏలూరు లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసిన మాగంటి బాబు కూడా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పక్కచూపులు చూస్తున్నారంట మాగంటి బాబు.

ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం లేదంట. తన వ్యాపారాలు చూసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారంట. దీంతో పార్టీ కార్యక్రమాలు చూసే వాళ్లు లేక చంద్రబాబు పలుసార్లు ఆయన్ని మందలించినా లెక్కచేయలేదంట. దీంతో ఈయన్ని చంద్రబాబు పక్కన పెట్టారట. అందుకే ఇటీవలే టీడీపీ ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కార్యవర్గంలోకి ఈయన్ని తీసుకోలేదని సమాచారం. రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే మాత్రం… రాష్ట్ర స్థాయిలో కాకపోయినా కనీసం జిల్లా స్థాయి పదవి కూడా ఇవ్వరా అంటూ మాగంటి బాబు మనస్తాపానికి గురయ్యారట.

మరోవైపు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా గన్ని వీరాంజనేయులును నియమించడం మాగంటి బాబుకు ఏమాత్రం ఇష్టం లేదట. దీంతో అధినేత మీద అసహనం, ఆగ్రహం పెరిగిపోయాయట. ఇక టీడీపీలో ఉండి ఇబ్బందులు పడే కన్నా … ఎంచక్కా వైసీపీలో చేరిపోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం వైసీపీతో రాయబారం నడుపుతున్నారట. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట మాగంటి బాబు.