టీడీపీలో తీవ్ర విషాదం.. మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత !

టీడీపీ లో తీవ్ర విషాదం నెలకొంది. ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించారు.

Maganti Ramji: టీడీపీలో విషాదం.. ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత

కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు. అయితే మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఆయన అనారోగ్య కారణాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇక ఆయన మృతికి సంబంధించి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక, టీడీపీ యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంజీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. తండ్రి మాగంటి బాబుకు పార్టీపరంగా చేదోడువాదోడుగా ఉండేవారు. ఇక, రాంజీ మృతితో మాగంటి బాబు కుంటుంతో పాటుగా, టీడీపీ శ్రేణులో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

మాగంటి రాంజీ మృతిపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక విన‌ప‌డ‌దు.మాగంటి రాంజీ మ‌న‌కి దూరం అయిపోయాడు.తెలుగుదేశానికి అండ‌గా ఉంటానంటూ జెండా ప‌ట్టిన ప‌సుపు సైనికుడా నీ మ‌ర‌ణం పార్టీకీ,నాకూ తీర‌ని లోటు. నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ నీ మరణానికి క‌న్నీటి నివాళి అర్పిస్తున్నాను. రాంజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.