ఆ గ్రామంలో 64ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు… ప్రజల తీర్పు ఎలా ఉంటుందో !

ఏపీ లో లోకల్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమవగా.. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. మూడో విడత నామినేషన్లు కూడా మొదలయ్యాయి. దేశంలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదేళ్లకోసారి గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్లు మారుతున్నారు.

open secret how consensus can be reached in panchayat elections

కానీ రాష్ట్రంలోని ఓ గ్రామంలో 64 ఏళ్లుగా స్థానికులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదంటే నమ్ముతారా, అసలు ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడమే తప్ప పోలింగ్ మాత్రం ఇంతవరకు జరగలేదు. ఆ గ్రామం ఏర్పడిన తర్వాత సర్పంచ్ ఎన్నికంతా ఏకగ్రీవమే. 1957 నుంచి ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేసిన దాఖలాలు లేనేలేవు. కానీ ఇప్పుడు సీన్ మారింది.. ఆ గ్రామంలో రాజకీయం మొదలైంది.

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేరు పరిధిలో ఉన్న పత్తికోళ్లలంక గ్రామంలో తొలిసారిగా గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. పత్తికోళ్ల లంక గ్రామం 1957లో ఏర్పడింది. అప్పటి నుంచి 2013 వరకు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. గ్రామంలో మొత్తం 3096 ఓట్లు ఉన్నాయి. అక్కడ అందరికీ ఒకటే మాట. కానీ 2013 నుంచి సీన్ మారింది. రాజకీయ ఆధిపత్యంతో గ్రూపులు పెరిగిపోయాయి.

నాటకీయ పరిణామాల మధ్య గతంలో ఏకగ్రీవమైన పంచాయతీకి ఈసారి ఎన్నికలు తప్పలేదు. ఈసారి పత్తికోళ్ల లంకకు మాజీ సర్పంచ్ మహాలక్ష్మి రాజు.. ఆయన వైరి గ్రూపుకు చెందిన బలే ఆనంద్ నామినేషన్ వేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని వేడెక్కించారు. తొలిసారి ఓటు వేయబోతున్న గ్రామస్తుల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కొల్లేరు గ్రామాల్లో రాజకీయాలుండవ్.. లంక గ్రామాల్లోని ప్రజలందరిదీ ఒకటే మాట. రాజకీయ వివాదాలకు దూరంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతుండేవి. కానీ ఇటీవల కాలంలో అక్కడ రాజకీయ ఆధిపత్యమే కనిపిస్తోంది.