తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ‘ఇండియన్ 2’ సినిమాతో మొదలైన సమస్యలు ఆయన తదుపరి చిత్రాలను వెంటాడుతున్నాయి. ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేలా కనిపించట్లేదు. ‘ఇండియన్ 2’ ఇంకా పూర్తికాకుండానే శంకర్ రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు. వాటిలో ఒకటి రామ్ చరణ్ చిత్రం కాగా మరొకటి రణ్వీర్ సింగ్ చిత్రం. తమ సినిమా కంప్లీట్ చేయకుండా శంకర్ రెండు పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లైకా నిర్మాతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో నలుగుతోంది.
న్యాయమూర్తి సైతం మాట్లాడి తేల్చుకోవాలని శంకర్, లైకా నిర్మాతలకు సూచించారు. కానీ చర్చలు ఫలించలేదు. శంకర్ ఏమో సినిమా కంప్లీట్ చేయడానికి ఇంకో మూడు నాలుగు నెలలు సమయం అడుగుతుండగా లైకా నిర్మాతలు మాత్రం ఇప్పటికప్పుడు సినిమా కంప్లీట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అది సాధ్యం కాదన్న శంకర్ తన తదుపరి సినిమాల ప్రీప్రొడక్షన్ పనుల్లో పడిపోయారు. వీలైతే ఇంకో రెండు నెలల్లో రామ్ చరణ్ చితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న లైకా సంస్థ తెలుగు, హిందీ ఫిల్మ్ చాంబర్ సభ్యులకు లేఖలు రాశారు. తమ సినిమా పూర్తిచేయకుండా శంకర్ అక్కడ సినిమాలను మొదలుపెట్టకుండా చూడాలని కోరారు. మరి రెండు పరిశ్రమల ఛాంబర్స్ ఎలా స్పందిస్తాయో చూడాలి.