పాదయాత్రలో బండి సంజయ్‌కి ‘ఎల్పీజీ గ్యాస్’ షాక్.!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సూపర్ షాక్ తగిలింది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో ఇప్పటికే రెండు విడతల పాదయాత్ర పూర్తి చేసుకున్న బండి సంజయ్, మూడో విడత పాతయాత్ర ప్రస్తుతం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ పాదయాత్రలో బండి సంజయ్‌కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ బీజేపీ శ్రేణులు హంగామా చేస్తున్నాయి.

నిజమే.! రాజకీయ నాయకుల పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడతారు. ప్రముఖ రాజకీయ నాయకులు తమ ఊళ్ళకు వస్తే, వారికి తమ సమస్యలు ఏకరువు పెట్టడానికైనా, నాయకుల్ని ఆహ్వానిస్తారు. పైగా, ఇలాంటి యాత్రలకు పెయిడ్ ఆర్టిస్టులనే వ్యవహారం వుండనే వుంటుంది కూడా.!

నిత్యం వేలల్లో కాదు, లక్షల్లో ఖర్చవుతుంటుంది పాదయాత్రలంటే. అయినా తప్పు, పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన నాయకుల వ్యవహారం కళ్ళ ముందు కనిపిస్తుండడంతో, ఆ దిశగానే తమ వ్యూహాల్ని పలువురు నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఇందుకు మినహాయింపేమీ కాదు.

కాగా, తెలంగాణలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఓ గ్రామంలో బండి సంజయ్‌కి ఎల్పీజీ షాక్ తగిలింది. కాంగ్రెస్ హయాంలో 500 రూపాయల లోపే వున్న వంట గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు 1100కి చేరిన విషయం విదితమే. ఇదే విషయమై బండి సంజయ్‌ని గ్రామస్తులు నిలదీశారు. ‘అబ్బే, నెలకి 30 రూపాయలు మాత్రమే భారం పడుతుంది..’ అంటూ బండి సంజయ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.

‘మా ఓటు మీకు వెయ్యం. గ్యాస్ సిలెండర్ ధర తగ్గించే పార్టీకే మా ఓటు’ అని ఓ గ్రామస్తులు చెప్పడంతే, అదే డిమాండ్ మిగతా గ్రామాల్లోనూ బండి సంజయ్‌కి ఎదురయ్యే అవకాశం వుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.