దూసుకొస్తున్న `ఎంఫాన్` తుఫాన్

ఏపీకి తుఫాన్లు కొత్త కాదు. అందులోనూ ఉత్త‌ర కోస్తా జిల్లాల‌ను తుఫాన్లు ఎప్ప‌టిక‌ప్పుడు కకావిక‌లం చేస్తుంటాయి. హుదూద్, తిత్లీ, ఫైలిన్ లాంటి తుఫాన్ లు ఎలాంటి న‌ష్టాల్ని తెచ్చాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అధిక వ‌ర్ష‌పాతం..భారీ ఈదురు గాలుల‌తో విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు ఎక్కువ‌గా న‌ష్ట‌పోతుంటాయి. తాజాగా మ‌రో తూఫాన్ దూసుకొస్తుంది. దానికి వాతావ‌ర‌ణ శాఖ ఎంఫాన్ గా నామ‌క‌ర‌ణం చేసింది. దీంతో తీర ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని..మ‌త్స‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసారు.

రానున్న గంట‌ల్లో రాష్ర్టంలో వాతావ‌ర‌ణ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.ప్ర‌స్తుతం రాష్ర్టంలో ఎండ‌లు మండిపోతున్నా….ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డిందంటే ఎంఫాన్ ఇంపాక్ట్ ప్రారంభ‌మైన‌ట్లేన‌ని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం లో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి తీవ్ర అల్ప‌పీడ‌నంగా మారుతుంద‌న్నారు. అటుపై వాయు గుండంగా రూపం మార్చుకుంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం అండ‌మాన్ నికోబార్ దీవులకు ద‌క్షిణంగా కిలో మీట‌ర్ ఎత్తున ఎంఫాన్ కేంద్రీకృత‌మై ఉంద‌న్నారు. వాయుగుండం ద‌క్షిణ మ‌ధ్య బంగాళాఖాతం మీదుగా ప్ర‌యాణించి శ‌నివారం సాయంత్రం లేదా అదివారం ఉద‌యానికి తుఫాన్ గా మారుతుంద‌ని తెలిపారు.దీని ప్ర‌భావం వ‌ల్ల ఆదివారం 70 నుంచి 80 కిలో మీట‌ర్ల వేంగా భారీగా బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని తెలిపారు. సోమ‌వారం ఉత్త‌ర కోస్తా ఒడిశా తీరం వెంబ‌డి ఇంకా బ‌ల‌మైన గాయ‌లు వీయ‌డానికి ఆస్కార‌ముంద‌న్నారు. అలాగే భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.