తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే..!

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను బలపడింది. ప్రస్తుతం ఇది గుజరాత్‌కి 520 కిలోమీటర్ల దూరంలో ఉండి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రాత్రికి ఈ వేగం 120 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత మెల్లగా బలహీనపడుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఆదివారం తర్వాత ఇది తిరిగి దిశ మార్చే అవకాశం ఉండటంతో, మరోసారి ప్రభావం చూపే అవకాశాన్ని వాతావరణశాఖ తెలిపింది.

తుపాను ప్రభావంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలో పెద్దగా వర్ష సూచన లేకపోయినా, తేలికపాటి జల్లులు మాత్రం కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో వచ్చే ఐదు రోజుల పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఈ సాయంత్రం తర్వాత తేలికపాటి వానలు పడవచ్చని లైవ్ శాటిలైట్ అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో జల్లులు పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఉత్తరాంధ్రలో వర్షాలు కురవవచ్చని అంచనా వేస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు. పశ్చిమ రాయలసీమలో మాత్రం పొడి వాతావరణమే కనిపించనుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

అరేబియా సముద్రంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, బంగాళాఖాతంలో 32 కిలోమీటర్ల వేగం ఉంది. ఏపీ తీరం వద్ద గాలి వేగం తక్కువగా ఉన్నా, విశాఖ నుంచి కోల్‌కతా వరకు తీరం వెంట గాలుల వేగం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అందువల్ల మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఉష్ణోగ్రతల పరంగా చూస్తే, తెలంగాణలో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్‌, ఏపీలో 31 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. తేమ పగటివేళ తెలంగాణలో 62 శాతం, ఏపీలో 55 శాతం ఉండగా, రాత్రివేళ 89 శాతం దాకా చేరుతుంది. ఈ తేమ వల్ల రాత్రిపూట కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇక తూర్పు ఆసియాలో మరో సూపర్‌ తుపాను మాట్మో (Matmo) బలంగా ఉంది. ఇది గంటకు 155 కిలోమీటర్ల వేగంతో చైనాకి దగ్గరగా కదులుతోంది. ఈ ప్రభావంతో ఆసియాలో మేఘాలు పెరిగాయి. దానికి తోడు అంటార్కిటికా నుంచి భూమధ్యరేఖ వైపు వస్తున్న చల్లని గాలులు వాతావరణంలో మార్పులు తెచ్చాయి. అక్టోబర్ చివరి వరకు వర్షాలు పడే అవకాశాలు పెరిగాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.