నైరుతి బంగాళాఖాతంలో కదిలిన వాతావరణ వ్యవస్థ ఇప్పుడు ఏపీకి ముప్పుగా మారుతోంది. తుఫాన్‌గా ప్రారంభమైన ఇది ప్రస్తుతం వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు వాతావరణం పూర్తిగా మారిపోనుందని తెలిపారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ-నైరుతి దిశగా కదిలిన ఈ వాయుగుండం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా సాగుతూ బలహీనపడుతోందని అధికారులు పేర్కొన్నారు. రానున్న 12 గంటల్లో దీని తీవ్రత మరింత తగ్గి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటివరకు ఏపీపై దాని ప్రభావం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నేటి నుంచే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, కొన్ని చోట్ల 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
వాయుగుండం ప్రభావం ఎక్కువగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. మరో రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని, ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
క్రమంగా గాలుల తీవ్రత పెరుగుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పంట కోత, విత్తనాల పనులను మరో మూడు రోజులు నిలిపివేసి పరిస్థితులను గమనించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం క్షణాల్లో మారిపోతుండటంతో ప్రజలు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ కోరింది.
