లోకేష్ ప్రమాణం: బాలయ్యను లాగుతోన్న వైఎస్సార్సీపీ.!

Lokesh Sawal, YCP Befetting Reply

Lokesh Sawal, YCP Befetting Reply

రాజకీయ ప్రమాణాల హీటు పెరిగింది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. తిరుపతి వేదికగా ప్రమాణం చేద్దామంటూ ఇటీవల సంచలన రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అన్న మాట ప్రకారం.. తిరుపతిలో ఈ రోజు ప్రమాణం చేయగా, ఈ సవాల్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకడుగు వేశారు. అసలు లోకేష్ సవాల్ పట్టించుకోదగ్గదే కాదన్నది వైసీపీ వెర్షన్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో తమకు సంబంధం లేదని వైఎస్ జగన్ ప్రమాణం చేయాలంటూ లోకేష్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఈ రోజు తిరుపతిలో లోకేష్, తమ కుటుంబానికి ఆ ఘటనతో సంబంధం లేదని ప్రమాణం చేశారు.. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్లు చేయడమే కాదు, హూ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యేలా చేశారు సోషల్ మీడియాలో. దాంతో, వైసీపీ ఒకింత ఇరకాటంలో పడింది. వైఎస్ వివేకానందరెడ్డి స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న. సొంత చిన్నాన్న హత్యకు గురైతే, ఆ కేసులో దోషుల్ని పట్టుకోలేకపోవడం జగన్ చేతకానితనమన్నది టీడీపీ వాదన. ఇదిలా వుంటే, వైసీపీ నుంచి పలువురు ముఖ్య నేతలు మీడియా ముందుకొచ్చారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, లోకేష్ చేసేవి పిల్ల చేష్టలన్నారు.

జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరేంత సీన్ లోకేష్ కి ఎక్కడుందని ప్రశ్నించారు కన్నబాబు. పనిలో పనిగా కొన్నేళ్ళ క్రితం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు కన్నబాబు. బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటనపైనా, స్వర్గీయ నందమూరి తారకరామారావుని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఘటనపైనా, రాజమండ్రిలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపైనా ప్రమాణం చెయ్ చూద్దాం.. అంటూ కన్నబాబు ప్రతిసవాల్ విసిరారు. అయితే, సవాల్ విసిరినప్పుడు స్వీకరించాలి తప్ప, ప్రతి సవాల్ విసిరితే ఉపయోగమేంటి.? అన్న చర్చ ప్రజల్లో గట్టిగా జరుగుతున్న వైనాన్ని అధికార పార్టీ గుర్తెరగాల్సి వుంటుంది.