నారా లోకేష్ ‘అతి’ మళ్ళీ అదే స్థాయిలో.. కానీ, ఉపయోగమేంటి.?

నారా లోకేష్ ఈ మధ్య మరింత బీభత్సంగా ప్రసంగాలు దంచేస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రాజకీయాల్లో ‘గొప్ప నాయకుడు’ అని అంతా తనను భావిస్తారనే భ్రమల్లో లోకేష్ వున్నారేమో. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.. ఇవన్నీ లోకేష్ సమర్థత వల్ల కాదు.. చంద్రబాబు పుత్రోత్సాహంతో కల్పించుకున్న పదవులు.. అనేది రాజకీయ ప్రత్యర్థుల నుంచి తరచూ లోకేష్ మీద వినిపించే విమర్శ.

ఇక, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది మొదలు, లోకేష్ మరింతగా స్థిమితం కోల్పోతున్నారు.. అసహనంతో రగిలిపోతున్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, నారా లోకేష్ నోటికి హద్దూ అదుపూ వుండటంలేదు. ముఖ్యమంత్రిపై దుర్భాషలాడేందుకూ వెనుకాడ్డంలేదాయన.

తాజా ఎపిసోడ్ కుప్పం మునిసిపల్ ఎన్నిలకు సంబంధించినది. ప్రచారం చేస్తోన్న లోకేష్, ఓటర్లను ఆకర్షించేందుకు, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాలి తప్ప, షరామామూలుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూలనాడితే ఎలా.? పైగా, పోలీసు అధికారులకూ వార్నింగులు ఇచ్చేస్తున్నారాయన.

రాజకీయాల్లో విమర్శలు మామూలేగానీ, మరీ ఇంత దిగజారుడుతనమా.? తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా లోకేష్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. చివరికి ఏమయ్యిందక్కడ.? నారా లోకేష్ గొంతు చించుకుని అరిచినా, టీడీపీని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు.

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేసి, ప్రమాణాలూ ఇంకోటని చెబుతూ హై డ్రామా క్రియేట్ చేసిన నారా లోకేష్‌ని తిరుపతి ఓటర్లు పూర్తిగా లైట్ తీసుకున్నారు. అయినా, లోకేష్ తీరు మారలేదు. మారితే, ఆయన చంద్రబాబు వారసుడెలా అవుతారు.?