రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు.. రోజూ ఏవేవో మాట్లాడుంటారు. కానీ, రెండు ప్రముఖ ఛానళ్ళకు మాత్రం ఆయన ఇచ్చే ‘ఫీడింగ్’ చాలా చాలా అవసరం. ఆ స్పేస్ ఆయన ఎలా దక్కించుకున్నారు.? అసలు ఆ రెండు ఛానళ్ళు ఆయనకు ఆ స్పేస్ ఎలా ప్రత్యేకంగా కేటాయించగలుగుతున్నాయి.? అన్నదానిపై చాలా అనుమానాలున్నాయి. చాలాకాలంగా ఆ రెండు ఛానళ్ళకు ఆ ఫీడింగ్ చాలా చాలా ముఖ్యమైపోయింది. ఆయన పేరు రఘురామకృష్ణరాజు. ఆ ఛానళ్ళు ఏంటన్నది అందరికీ తెలిసిన సంగతే. రఘురామకు షరతలుతో కూడిన బెయిల్ ఇస్తూ, న్యాయస్థానం.. ఆయన ఏ విషయాలూ మీడియాతోగానీ, సోసల్ మీడియా ఇంటర్వ్యూల్లోగానీ మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. దాంతో, ఎక్కువ బాధపడిపోతున్నది ఆ రెండు ఛానళ్ళే. ‘అలా ఎలా ఆదేశిస్తారు.?’ అని పైకి గట్టిగా అనలేక, లోలోపల గింజుకుంటున్నాయట సదరు ఛానళ్ళు.
అయితే, ఈ విషయమై ఇప్పటికే ఆయా ఛానళ్ళు చర్చా కార్యక్రమాలు షురూ చేశాయి.. రఘురామకు బెయిల్ రావడంతో పండగ చేసుకుంటూ, ఆ కోణంలో చర్చలు మొదలెట్టేశాయి. అదే రఘురామకు ఈ మాట్లాడకూడదన్న షరతు విధించకుండా వుండి వుంటే.. తొలి ఇంటర్వ్యూ, రెండో ఇంటర్వ్యూ.. ఆయా ఛానళ్ళకే వచ్చేదేమో. పొద్దున్నుంచి సాయంత్రం దాకా రఘురామరాజునే రేపట్నుంచి చూపించేవారేమో. రఘురామను నేరుగా చూపించకపోతేనేం.. ఆయన చుట్టూ చాలా అల్లికలకు అవకాశమైతే వుంది. అదెలాగూ తప్పదు.. ఇప్పటికే రచ్చ మొదలైంది కూడా. అన్నట్టు, రఘురామతోపాటు ఈ కేసులో ఆ రెండు ఛానళ్ళపైనా ఏపీ సీఐడీ నిఘా పెట్టిన సంగతి తెలిసిందే.