కరోనా అంటే భయం లేదు.. లిక్కర్ దొరకదంటే మాత్రం భయమే.!

No Corona Fear For Liquor Fans

No Corona Fear For Liquor Fans

మద్యపానం హానికరం.. అని ఎంతలా ప్రచారం చేస్తున్నా మద్యపాన ప్రియులు మాత్రం దాన్ని లెక్క చేయరు. మద్యపానం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రచారం చేయడం కోసం పెద్దయెత్తున ఖర్చు చేసే ప్రభుత్వాలు, మద్యాన్ని మాత్రం నియంత్రించలేవు, నిషేధించలేవు. దానిక్కారణం అందరికీ తెలిసిందే.. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వాల ఖజానాలకు అత్యంత కీలకం. అంటే, జనం ప్రాణాలు తీసే మద్యం, ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు అన్నమాట. మద్యపానం చేసేవారికి కరోనా ముప్పు చాలా చాలా ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా, కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు మద్యాన్ని నియంత్రించలేకపోతున్నాయి.. నిషేధించలేకపోతున్నాయి.

అంత్యక్రియలకైతే పది మంది మాత్రమే.. పెళ్ళికి అయితే 20 మంది మాత్రమే.. అని రూల్స్ పాస్ చేస్తున్న ప్రభుత్వాలు, మద్యం దుకాణాల వద్ద గుమికూడేవారి విషయంలో పరిమితులు విధించడంలేదు. అక్కడ ఎలాంటి సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా చర్యలుండవు. అసలక్కడ మాస్కులు ధరించేవారే కనిపించరు. ఇక, తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానున్న దరిమిలా, ఎక్కడికక్కడ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పోటెత్తారు. తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. వారిని అదుపు చేయడం మద్యం దుకాణాల నిర్వాహకుల వల్ల కావడంలేదు. ఆయా మద్యం దుకాణాల నిర్వాహకులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని మరీ వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో మద్యాన్ని ఆన్‌లైన్ ద్వారా డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని కల్పిస్తుండడమంటే, మద్యం అమ్మకాలపై ఆయా ప్రభుత్వాలకెంత మమకారమో అర్థం చేసుకోవచ్చు. ఇక, కరోనా అంటే మందుబాబులకి భయం లేదు.. అదే మద్యం దొరకదంటే మాత్రం భయంతో వణికిపోతారు. అలా మద్యం కోసం మందుబాబులు ఎగబడటమే ప్రభుత్వాలకీ అవసరం.. ఎందుకంటే, ఖజానా నిండాలి కదా.