Tirumala: తిరుమలలో మళ్లీ అపచారం.. పవిత్ర క్షేత్రంలో ఆ పనేంటని.. భక్తుల ఆగ్రహం..!

యావత్ హిందూ భక్తుల మనోభావాలకు ప్రతీకగా నిలిచిన వైకుంఠక్షేత్రం తిరుమలలో మరోసారి కలవరపెట్టే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి సమీపంలో మద్యం ఆనవాళ్లు కనిపించడంతో భక్తుల హృదయాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భక్తి, పవిత్రతకు ప్రతీకగా భావించే తిరుమలలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది.

తాజాగా తిరుమలలోని పోలీసు అతిథి గృహం పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కాళీ మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావించే చోటే ఈ దృశ్యాలు బయటపడటంతో భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిత్యం తనిఖీలు, కఠిన పర్యవేక్షణ జరుగుతోందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమల కొండపై మాంసాహారం, మద్యపానం పూర్తిగా నిషేధం అనే నిబంధన దశాబ్దాలుగా అమల్లో ఉంది. అయినా కూడా మద్యం ఆనవాళ్లు మళ్లీ మళ్లీ బయటపడటం భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది. గతంలో కూడా కొందరు యువకులు మద్యం మత్తులో ఘర్షణలకు దిగిన ఘటనలు వెలుగులోకి రావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఘటనలు పునరావృతం కావడం తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

ప్రత్యేకంగా అలిపిరి తనిఖీ కేంద్రం వంటి కట్టుదిట్టమైన చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, మద్యం కొండపైకి ఎలా చేరుతోందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. ప్రతి వాహనాన్ని, ప్రతి భక్తుడిని తనిఖీ చేస్తున్నామన్న అధికారుల ప్రకటనలకు ఈ ఘటనలు విరుద్ధంగా నిలుస్తున్నాయి. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంలో టీటీడీ విజిలెన్స్, పోలీసు విభాగాలు విఫలమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యవస్థలే అప్రమత్తంగా వ్యవహరించకపోతే, తిరుమల ఆధ్యాత్మిక వాతావరణానికి ముప్పు తప్పదన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమలలో మద్యం ప్రవేశాన్ని శాశ్వతంగా అడ్డుకునేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.