లాక్ డౌన్: తాళమేసి, పాతాళంలోకి తోసేశారు.!

Lock Down, A Nightmare for 130 Cr Indians

Lock Down, A Nightmare for 130 Cr Indians

జనతా కర్ఫ్యూకి ఏడాది. మామూలుగా అయితే దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎందుకంటే, ఇది ప్రధాని నరేంద్ర మోడీ జమానా కదా.! కంచాలు, గరిటెలు పట్టుకుని సాయంత్రం వేళ శబ్దం చేయడమో.. లేదంటే, రాత్రి వేళ గంట కొట్టడమో, కుదిరితే దీపాలు వెలిగించడమో చెయ్యాల్సిందే. అరరె, ఈ ఐడియా ఈ సారి ఎందుకో కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. వచ్చి వుంటే, ఈపాటికే ఆర్డర్స్ షురూ అయ్యేవి. అందుకు అనుగుణంగా భజనపరులు అడ్డగోలు విశ్లేషణలు చేసేటోళ్ళే. మంత్రాలూ, మాయలూ.. వైబ్రేషన్లూ.. ఇంకేవేవో కథలు వినిపించేటోళ్ళే. ఏడాది క్రితం ఇదే రోజున లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత జనతా కర్ఫ్యూ.. ఆ తర్వాత సంపూర్ణ లాక్ డౌన్. ఈ దెబ్బకి దేశం విలవిల్లాడింది. ఎక్కడివారక్కడే గప్ చిప్. సాటి మనిషిని చూస్తే భయం, చూడకపోతే భయం. భార్య ఓ చోట, భర్త మరో చోట. తల్లి ఓ చోట, పిల్ల ఇంకో చోట.. అస్సలేమాత్రం కనికరం లేకుండా వ్యవహరించారు పాలకులు.

ఫలితంగా చాలామంది ప్రమాదకరమైన ప్రయాణాలు చేశారు.. కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. ప్రజలు ఆర్థికంగానూ చితికిపోయారు. అప్పటినుంచి ఇప్పటిదాకా అందులో చాలామంది కోలుకోలేకపోయారు. మళ్ళీ ఇంతలోనే కరోనా కేసుల పెరుగుదల షురూ అయ్యింది.. రేపో మాపో లాక్ డౌన్ తప్పదన్న ప్రచారమూ మొదలయ్యింది. ఈసారి లాక్ డౌన్ అంటే, ఇంకేమీ వుండదు. నిజమే, లాక్ డౌన్ పేరుతో.. తాలం వేసేసి.. పాతాళంలోకి తోసేశారు. ఇక, అక్కడికంటే కిందికి పడిపోవడం ఇంకేమీ వుండదు. లాక్ డౌన్ వల్ల కొన్ని ఉపయోగాలూ లేకపోలేదు. అప్పటికి ఆ వైరస్ కొత్త గనుక.. దానికి వైద్య చికిత్స ఎలా చేయాలన్నదానిపై పూర్తి అవగాహన లేదు గనుక.. లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది.. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో వైద్య చికిత్సకు సంబంధించిన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. జనంలోనూ ఆ వైరస్‌ని తట్టుకునే పరిస్థితులూ ఏర్పడ్డాయి. కేసుల సంఖ్య పెరిగి, మరణాల సంఖ్య తగ్గేసరికి.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, లాక్ డౌన్ వల్ల బాధలు పడినవారు, ఇంకా పడుతున్నవారిని ప్రభుత్వాలు ఆదుకోకపోవడమే అత్యంత బాధాకరం. అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి.. రాష్ట్రాలూ దెబ్బతిన్నాయి. ఆదుకోవాల్సిన కేంద్రం కూడా ‘మేమూ దెబ్బతిన్నాం..’ అని చేతులు దులిపేసుకోవడమెంతవరకు సబబు.?